Air Force Rape Case: అత్యాచార బాధితురాలిపై రెండు వేళ్ల పరీక్ష.. సుప్రీంకోర్టు నిషేధించినా!
కోయంబత్తూర్‌లోని రెడ్‌ఫీల్డ్స్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణలో ఉన్న మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.

Govt Says 1.71 Lakh Rape Cases Registered in India in Five Years
Air Force Rape Case: కోయంబత్తూర్‌లోని రెడ్‌ఫీల్డ్స్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాలేజీలో శిక్షణలో ఉన్న మహిళపై అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత.. అమితేశ్ అనే ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 26, 2021న అతనిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
అయితే, ఎయిర్ ఫోర్స్ అధికారులు లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు రాబట్టే క్రమంలో తనతో అమానుషంగా ప్రవర్తించారని, సుప్రీంకోర్టు నిషేధం విధించిన అనుచితమైన రెండు-వేళ్ల పరీక్ష బలవంతంగా నిర్వహించి, మరింత బాధపెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ సమయంలో పోలీసులు కూడా దారుణమైన ప్రశ్నలు సంధించి మనోవేధనకు గురిచేశారని, గతంలో లైంగిక అనుభవం ఉందా? ప్రశ్నించారంటూ వాపోయింది.
ఐఏఎఫ్ ఉన్నతాధికారులు నుంచి సరైన స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పిన ఆమె.. తన ఫిర్యాదును రిటర్న్ చేసుకోవాలని ఒత్తిడి వచ్చినట్లుగా చెప్పారు. పోలీసులకు మాత్రం దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది.
అశాస్త్రీయమైన రెండు వేళ్ల పరీక్షను రేప్ జరిగిన బాధితురాలిపై గతంలో చేసేవారు. రెండు వేళ్ల పరీక్ష అత్యంత అమానవీయ, గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమైనదంటూ 2013 మేలో సుప్రీంకోర్టు ఈ పరీక్ష నిర్వహణను నిషేధించింది. రెండు వేళ్ల పరీక్ష అంటే మరోసారి వారిపై అత్యాచారానికి పాల్పడటంతో సమానమని అప్పట్లో కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసుపై కోయంబత్తూరులోని గాంధీపురం మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు ప్రాథమిక విచారణ చేస్తున్నారు.