Air India Flight : విమానం గాల్లో ఉండగా.. ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్.. రంగంలోకి సీఐఎస్ఎఫ్ సిబ్బంది..
Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో కలకలం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు చేసిన పనికి పైలట్ హడలిపోయాడు.

Air India flight
Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో కలకలం చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు చేసిన పనికి పైలట్ హడలిపోయాడు. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు ఓ ప్రయాణికుడు తీవ్రంగా ప్రయత్నించాడు. హైజాక్ భయంతో పైలెట్ తలుపు తెరవకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. విమానం వారణాసిలో దిగిన తరువాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది వచ్చి ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ IX-1086 విమానం సోమవారం ఉదయం బెంగళూరు నుంచి వారణాసి వెళ్తుంది. ఉదయం 8గంటల సమయంలో విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు పైలట్లు ఉండే కాక్‌పిట్‌లో చొరబడే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన విమానం సిబ్బంది అతడ్ని బలవంతంగా తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు ఏం జరుగుతుందోనని భయంతో హడలిపోయారు.
విమానం వారణాసి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన తరువాత సీఐఎస్ఎఫ్ సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం అతన్ని పోలీసులకు అప్పగించారు. అయితే, టాయిలెట్ కోసం వెతుకుతుండగా ఆ ప్రయాణీకుడు కాక్ పిట్ వరకు నడిచి వెళ్లడంతో ఈ గందరగోళం నెలకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తొలిసారి విమానంలో ప్రయాణం చేస్తుండటం కారణంగా ప్రొటోకాల్ తెలియదని ఆ ప్రయాణికుడు విమాన సిబ్బందికి తెలిపినట్లు సమాచారం.
సెక్యూరిటీ ప్రొటోకాల్ ప్రకారం ఆ ప్రయాణికుడిని పోలీసులు విచారిస్తున్నారు. అతనితోపాటు ప్రయాణం చేస్తున్న మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకునేందుకు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వారినికూడా విచారించి పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
విమానంలోని కాక్‌పిట్‌లో ప్రవేశించాలంటే డోర్ తెరవాల్సి ఉంటుంది. ఆ డోర్ తెరవాలంటే ఓ ప్రత్యేకమైన పాస్‌కోడ్ ఉంటుంది. దానిని ఎంటర్ చేస్తేనే ఆ డోర్ తెరుచుకుంటుంది. సదరు వ్యక్తి కెప్టెన్ నిర్ణయం ఆధారంగానే లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే.. ప్రయాణికుల భద్రత విషయంలో ఏ మాత్రం రాజీపడమని తెలిపింది. ఘటనకు సంబంధించిన రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది.