Air India Flight Fire: మరో ఎయిరిండియా విమానంలో మంటలు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ల్యాండ్ అయిన కాసేపటికే..
ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

Air India Flight Fire: ఢిల్లీలో ఎయిరిండియా విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ల్యాండ్ అయిన కాసేపటికే పవర్ యూనిట్ లో మంటలు కనిపించాయి. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రయాణికులను సిబ్బంది సురక్షితంగా కిందకు దించేశారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఏఐ 315 విమానంలో మంటలు చెలరేగాయి. ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు కనిపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పి ప్రయాణికులను సేఫ్ గా కిందకు దించేశారు. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
విమానం ల్యాండ్ అయిన తర్వాత యాక్సిలరీ పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. అప్పటికే ప్లేన్ ను ఎగ్జిట్ గేట్ దగ్గర పార్కింగ్ చేసి ఉంచారు. ప్రయాణికులు విమానం నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన సిబ్బంది ప్రయాణికులను త్వరత్వరగా కిందకు దించేశారు. ఎయిర్ పోర్టులోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పివేసింది. ఈ ఘటనలో విమానం పాక్షికంగా డ్యామేజ్ అయినట్లు గుర్తించారు.
అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం దుర్ఘటన దేశవ్యాప్తంగా పెను విషాదం నింపిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన విమానం కాసేపటికే క్రాష్ అయ్యింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న వారంతా (ఒక్కరు మినహా) ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ఎయిరిండియా విమానంలో మంటలు కలకలం రేపాయి. ఎయిరిండియా విమానాలకే తరుచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ వరుస ఘటనలతో ఎయిరిండియాలో ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితి ఏర్పడింది.
Also Read: గూగుల్ బిగ్ షాక్.. 11 వేల యూట్యూబ్ ఛానల్స్ తొలగింపు.. ఎందుకంటే..
గత నెల 12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా దుర్ఘటన విమాన ప్రయాణాల పట్ల కొంత ఆందోళన నింపింది. తాజా ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. మంటలు చెలరేగడానికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఏది ఏమైనా ఎయిరిండియాలో ప్రయాణం అంటేనే.. ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.