Google: గూగుల్ బిగ్ షాక్.. 11 వేల యూట్యూబ్ ఛానల్స్ తొలగింపు.. ఎందుకంటే..
ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ గూగుల్ ఇదే తరహా కారణాలతో 23వేలకు పైగా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే.

Google: యూట్యూబ్ ఛానళ్లపై గూగుల్ మరోసారి కొరడా ఝళిపించింది. ఏకంగా 11వేల యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించింది. వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయనే ఆరోపణలతో గూగుల్ ఈ చర్య తీసుకుంది. ఇందులో అత్యధికంగా చైనా, రష్యాకు చెందిన ఛానళ్లు ఉన్నాయి. తప్పుడు సమాచారం వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో భాగంగా వాటిని బ్లాక్ చేసినట్లు గూగుల్ వివరించింది.
తొలగించిన వాటిలో చైనాకు సంబంధించినవే 7వేల 700 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. అవి భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని.. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ పలు కంటెంట్‌లను పోస్టు చేస్తున్నాయని గూగుల్ ఆరోపించింది.
ఇక రష్యాకు చెందిన 2వేలకు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర వెబ్‌సైట్లపై వేటు వేసినట్లు గూగుల్ వెల్లడించింది. ఆ ఛానల్స్ లో యుక్రెయిన్, నాటోలపై విమర్శలు చేస్తూ.. రష్యాకు అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు గూగుల్ గుర్తించింది. రష్యాలోని పలు సంస్థలకు కూడా ఈ ఛానళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల 20 యూట్యూబ్ ఛానళ్లు, నాలుగు ఖాతాలు, రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థకు సంబంధించిన ఓ బ్లాగును తొలగించినట్లు గూగుల్ వివరించింది.
Also Read: ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కేసు.. ఆ 8వేల 800 లింకులు తొలగించండి.. కోర్టు కీలక ఆదేశాలు
చైనా, రష్యాలతో పాటు ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్‌బైజాన్, ఘనాకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను కూడా తొలగించినట్లు గూగుల్ తెలిపింది. ఆయా దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానల్స్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నిరాధార, అసత్య కంటెంట్ ను ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని గూగుల్ తెలిపింది. వాటిని నిలువరించడానికే ఈ చర్యలు తీసుకున్నామంది. కాగా.. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనూ గూగుల్ ఇదే తరహా కారణాలతో 23వేలకు పైగా ఖాతాలను తొలగించిన సంగతి తెలిసిందే. అసత్యాలు ప్రచారం చేసినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చింది గూగుల్. వేటు వేయడం పక్కా అని తేల్చి చెప్పింది.