పాక్‌లో ఉగ్రవాదం అంతం అయ్యే వరకు పోరాటం ఆగదు : త్రివిధ దళాలు

దాయాది దేశంపై భారత్ చేసిన తీవ్ర ఒత్తిడుల ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కమాండర్‌ను శుక్రవారం(మార్చి 1) విడుదల చేయనుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను వివరించారు. భారత భూభాగంలోని మిలటరీ స్థావరాలను పాక్ టార్గెట్ చేస్తూ దాడికి యత్నించిందని వెల్లడించారు.
ఫిబ్రవరి 14 తర్వాత సరిహద్దుల్లో కాల్పుల విషయంలో పాక్ సైనికులు హద్దు మీరి ప్రవర్తించారన్నారు. మన మిలటరీ స్థావరాలను టార్గెట్ చేసినందుకు ధీటుగా బదులిచ్చినట్లు తెలిపారు. వారి కవ్వింపు చర్యలకు సమాధానంగానే దాడులు జరిపి సమర్థవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో పాక్‌లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారో అనేది కచ్చితంగా చెప్పలేమన్నారు.
ఫిబ్రవరి 27న ఉదయం పదిన్నరకు పాక్‌కు చెందిన యుద్ధ విమానాల జాడ భారత రాడార్‌కు కనిపించింది. వారిని వెంబడించే ప్రయత్నంలోనే మన పైలట్లు అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ముగ్గురు భారత పైలెట్లు అరెస్టు అయ్యారని పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. F-16 శకలాలు రాజౌరీ సమీపంలో కనిపించాయని వాటిని మీడియా ముందే ప్రదర్శించారు. LOCలో పూర్తి స్థాయి నిఘాను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. పాక్ ఏ రూపంలో దుశ్చర్యలకు పాల్పడ్డా ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అభినందన్ క్షేమంగా వెనక్కు వస్తున్నందుకు మాకు ఆనందంగా ఉందన్నారు.