మమతను ఢీ కొట్టేందుకు రెడీ…బెంగాలీ నేర్చుకుంటున్న అమిత్ షా

2021లో జరిగే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు,కేంద్రహోంశాఖ మంత్రి ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్దంలో భాగంగా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారు అమిత్ షా. ఇందుకోసం ఓ టీచర్ ని కూడా పెట్టుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ‘బెంగాలీ ఆత్మగౌరవానికి’ ప్రాధాన్యమిస్తూ ప్రసంగిస్తున్నారు.
మమతా బెనర్జీ ఇటీవలి తన ప్రసంగంలో ‘మా మాటీ మనుష్’ (అమ్మ, మాతృభూమి, ప్రజలు) అనే నినాదాన్ని తెరపైకితెస్తూ.. బెంగాలీల ఆత్మగౌరవంపై గట్టిగా మాట్లాడారు. అమిత్‌షాను బయటివ్యక్తి అని కూడా అన్నారు. మమతా బెనర్జీ లాంటి పవర్ ఫుల్ లీడర్ ని ఢీ కొట్టే క్రమంలో భాష చాలా ముఖ్యమని గుర్తించిన షా…ఎన్నికల వ్యూహరచనలో భాష ప్రతిబంధకం కాకూడదని, ప్రచార సమయంలో బెంగాలీలో ప్రసంగించి అక్కడి ప్రజలకు చేరువకావాలని భావిస్తున్నారు.
ఎన్నికల వ్యూహరచనలో చాణుక్యుడిగా పేరున్న అమిత్‌షా ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ ఎన్నికల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా బెంగాల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని పార్టీ కార్యకర్తలకు, ఓటర్లకు చేరువయ్యేందుకు అమిత్‌షా బెంగాలీ భాష నేర్చుకుంటున్నారని, దీనిలో పెద్ద విషయం ఏమీలేదని, బెంగాలీ, తమిళంతోపాటు అమిత్‌షా నాలుగు భాషలను నేర్చుకుంటున్నారని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అమిత్‌షా గుజరాతీతోపాటు హిందీలోనూ అనర్గళంగా మాట్లాడుతారు.