Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌‌లో భూకంపం.. నాలుగు రోజుల్లో మూడోసారి!

అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్‌లో భూకంపం సంభవించింది.

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌‌లో భూకంపం.. నాలుగు రోజుల్లో మూడోసారి!

Earth Quake

Updated On : October 5, 2021 / 11:23 AM IST

Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సియాంగ్ జిల్లాలోని పాంగిన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా అధికారులు ప్రకటించారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(NCS) ఈమేరకు ప్రకటన చేసింది. అయితే, భూకంపం సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ప్రకటించారు అధికారులు.

నాలుగు రోజుల్లో మూడోసారి:
గడిచిన నాలుగు రోజుల్లో ఈ రోజు ఉదయం 8.8 గంటలకు వచ్చిన భూకంపం మూడవదిగా అధికారులు చెబుతున్నారు. భూకంపం సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చారని, అక్టోబర్ 2 నుండి ఇప్పటివరకు అరుణాచల్ ప్రదేశ్‌లో మూడుసార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు భయపడుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే, ప్రతిసారీ భూకంప తీవ్రత తక్కువగా ఉండటం ఉపశమనం కలిగించే విషయం.

అక్టోబర్ 2న పాంగిన్‌లోనే 4.1 తీవ్రతతో భూకంపం వచ్చింది
దీని తర్వాత అక్టోబర్ 3న బాసర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఈరోజు పాంగిన్‌లో మళ్లీ 4.5 తీవ్రతతో భూకంపం నమోదైంది.

కర్ణాటకలో కూడా ప్రకంపనలు:
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో 2.7 కంటే తక్కువ తీవ్రతతో రిక్టర్ స్కేల్‌పై భూకంపం సంభవించింది. నెలలో ఐదుసార్లు భూకంపాలు సంభవించడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ప్రజలు భూమి లోపల నుంచి వెలువడే పెద్ద శబ్దాలను విన్నప్పుడల్లా ఇళ్ల నుంచి బయటకు పరుగెత్తుతున్నారు.

భూకంపాల అధ్యయనానికి సబ్ కమిటీ:
దక్షిణ భారతం వైపు ఉండే పలకలు ఉత్తర భారతదేశం వైపు కదలడం వల్లే నిరంతరం వణుకు పుడుతోందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లోతైన అధ్యయనం కోసం సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తుంది.

భూకంపం సంభవిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలు:
ఇంట్లో ఉంటే కచ్చితంగా బయటకు రావాలి.
బయటకు వచ్చిన తర్వాత భవనాలు, చెట్లు, స్తంభాలు మరియు వైర్‌లకు దూరంగా ఉండాలి.
వాహనంలో ప్రయాణిస్తుంటే, వీలైనంత త్వరగా వాహనాన్ని ఆపుకోవాలి.
అగ్గిపుల్ల వెలిగించవద్దు.. శబ్దం చేయరాదు.

భూకంపం ఎందుకు వస్తుంది?
భూమి ప్రధానంగా నాలుగు పొరలతో రూపొందించబడింది. సాలిడ్ కోర్, లిక్విడ్ కోర్, మాంటిల్ మరియు క్రస్ట్. క్రస్ట్‌కు సంబంధించిన ఎగువ మాంటిల్ కోర్‌ను లిథోస్పియర్ అంటారు. ఈ 50 కి.మీ మందపాటి పొర అనేక విభాగాలుగా విభజించబడింది. వీటిని టెక్టోనిక్ ప్లేట్లు అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్లు వాటి స్థానాల్లో కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్ ఎక్కువగా కదలడం ప్రారంభించినప్పుడు భూకంపం సంభవిస్తుంది. ఈ ప్లేట్లు వాటి ప్రదేశం నుండి అడ్డంగా మరియు నిలువుగా కదులుతూ ఉంటాయి. భూకంప తీవ్రత భూకంప కేంద్రం నుంచి వెలువడే శక్తి తరంగాల ద్వారా అంచనా వేస్తారు.