తొలి ఆదివాసీ మహిళా పైలట్…చరిత్ర సృష్టించిన అనుప్రియా

కమర్షియల్ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ మహిళా పైలట్ గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించింది. ఒడిషాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన 23ఏళ్ల అనుప్రియ లక్రాకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం నుంచి వచ్చి కమర్షియల్ ఫ్లైట్ నడిపే తొలి ఆదివాసీ మహిళ పైలెట్ ఘనతను సాధించిన అనుప్రియ ఎందరో మహిళలకు ఆదర్శం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
చిన్నతనం నుంచి పైలట్ కావాలని కలలు కన్న అనుప్రియ…2012లో ఇంజినీరింగ్ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్‌లోని పైలట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది.
ఒడిశా నుంచి పైలట్‌గా ఎంపికైన తొలి ఆదివాసీ మహిళ అనుప్రియే కావడం విశేషం. ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ పట్నాయక్ ప్రశంసించారు. అనుప్రియ తండ్రి మరినియాస్ లక్రా… ఒడిశా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.