అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్.. మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా
జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Delhi Minister Raaj Kumar Anand: జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఆయన వైదొలగారు. కేజ్రీవాల్ క్యాబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తున్నారు. అవినీతి ప్రభుత్వంలో భాగస్వామిని కాలేక తన పదవికి రాజీనామా చేసినట్టు రాజ్ కుమార్ ప్రకటించారు.
తమ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందనడానికి కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా అరెస్టులే నిదర్శమని వ్యాఖ్యానించారు. “అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాను. ఈ రోజు పార్టీ అవినీతి అక్రమాలకు గురైంది. అందుకే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను” అని రాజ్ కుమార్ ఆనంద్ అన్నారు. కొద్దిరోజుల క్రితం రాజ్ కుమార్ ఆనంద్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
పటేల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజ్ కుమార్ ఆనంద్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ అరెస్టైన తర్వాత రాజీనామా చేసిన మొదటి మంత్రి ఆనంద్ కావడం గమనార్హం. ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్.. తీహార్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
కోర్టులోనూ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
జైల్లో ఉన్న తనకు న్యాయ సలహాలు తీసుకునేందుకు సమయం పెంచాలంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను స్పెషల్ కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ తన న్యాయవాదిని కలిసేందుకు వారానికి రెండు సార్లు అనుమతి ఉంది. వారానికి ఐదు సార్లు లాయర్‌ను కలిసేందుకు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్‌లో ఆయన కోరారు. దీనికి కోర్టు ఒప్పుకోలేదు.
Also Read: అమిత్ షాను కలిస్తే తప్పేంటి.. ఆ విషయం చెప్పిన మొదటి వ్యక్తిని నేనే: రాజ్ ఠాక్రే