Vikram Misri: మీకు బుద్దుందా..? విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. సోషల్ మీడియా ఖాతాలకు లాక్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఒవైసీ, శశిథరూర్

విక్రమ్ మిస్రీపై ట్రోల్స్ ను పార్టీలకు అతీతంగా నేతలు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు.

Vikram Misri: మీకు బుద్దుందా..? విక్రమ్ మిస్రీపై ట్రోల్స్.. సోషల్ మీడియా ఖాతాలకు లాక్.. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ఒవైసీ, శశిథరూర్

Vikram Misri

Updated On : May 12, 2025 / 4:10 PM IST

Vikram Misri: భారత్ – పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు శనివారం కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ఆయనపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన కుటుంబం, వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ ట్రోల్స్ చేయడంతో ఆయన తన సోషల్ మీడియా ఖాతాలను లాక్ చేసుకున్నారు. అయితే, మిస్రీపై ట్రోల్స్ ను పార్టీలకు అతీతంగా నేతలు, మాజీ దౌత్యవేత్తలు ఖండించారు. నిజాయితీగా విధులు నిర్వర్తిస్తున్న పౌర సేవకులపై వ్యక్తిగతంగా ఇలాంటి ట్రోల్స్ చేయడం విచారకరమని ఐఏఎస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఆర్టీఎస్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది.

Also Read: US-China: గుడ్ మీటింగ్.. అమెరికా- చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం..!

మిస్రీపై ట్రోలింగ్స్ ను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నిజాయితీ, కష్టపడే తత్వం కలిగిన అధికారి విక్రమ్ మిస్రీ. ప్రభుత్వ ఉద్యోగులు కార్యనిర్వహక వర్గం ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిస్తారు. వారు వెల్లడించే వివరాల్లో తమ సొంత నిర్ణయాల కంటే, ప్రభుత్వ విధానాలను ప్రతిబింబిస్తాయి. కాబట్టి వారిని విమర్శించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు’’ అని ఓవైసీ అన్నారు.

విక్రమ్ మిస్రీపై ట్రోల్స్ గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సమయంలో మిస్రీ అద్భుతమైన పనితీరు కనబర్చారు. అలాంటి అధికారిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు. మిస్రీపై విమర్శలు చేస్తున్న వారు ఆయన కంటే భిన్నంగా, మెరుగ్గా చేయగలరా..?’’ అని శశిథరూర్ ప్రశ్నించారు.

 

కాంగ్రెస్ నేత సల్మాన్ అనీస్ సోజ్ స్పందిస్తూ.. కశ్మీర్ కు చెందిన విక్రమ్ మిస్రీ దేశ గౌరవాన్ని నిలబెట్టేలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు మనం ఇచ్చే గౌరవం విమర్శలా..? చేసిన దానికి కృతజ్ఞత చెప్పే సంస్కృతి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవడం మంచింది అంటూ ట్రోలర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాక.. మాజీ విదేశాంగశాఖ మంత్రి, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా మిస్రీపై ట్రోల్స్ ను తీవ్రంగా ఖండించారు. ఇలా పార్టీలకు అతీతంగా నేతలు, అధికార వర్గాలు విక్రమ్ మిస్రీపై ట్రోల్స్ చేస్తున్న వారికి తమదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.