US-China: గుడ్ మీటింగ్.. అమెరికా- చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం..!

చైనాతో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తెలిపారు.

US-China: గుడ్ మీటింగ్.. అమెరికా- చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం..!

US China

Updated On : May 12, 2025 / 2:06 PM IST

US-China: అమెరికా – చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిసినట్లు సమాచారం. ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతను తగ్గించేందుకు స్విట్జర్లాండ్ వేదికగా రెండు రోజులపాటు చర్చలు జరిగాయి. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీన్ లు చైనా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గించేలా వీరి మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

 

చైనా, అమెరికా మధ్య చర్చలపై స్కాట్ బెసెంట్ మాట్లాడారు. చైనాతో జరిగిన చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని తెలిపారు. ఇరు దేశాల మధ్య 1.2 మిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఇరుదేశాలు 90రోజుల పాటు తమ టారిఫ్‌లను 115 శాతం మేర తగ్గించుకుంటాయని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందంతో అమెరికా దిగుమతులపై చైనా తన సుంకాలను 115శాతం అంటే 125శాతం నుంచి 10శాతానికి తగ్గించనుంది. మరోవైపు.. చైనా దిగుమతులపై అమెరికా తన సుంకాలను 145శాతం నుంచి 30శాతానికి తగ్గిస్తుంది. 90రోజుల పాటు ఈ టారిఫ్ లు అమల్లో ఉండేలా ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఏప్రిల్ 2 నుండి అమెరికాపై చైనా విధించిన ప్రతీకార టారిఫ్ లను క్రమంగా తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

అమెరికా, చైనా ప్రతినిధుల చర్చల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ వేదికగా పోస్టు చేశారు. ‘‘చైనాతో మంచి భేటీ జరిగింది. చాలా విషయాలు చర్చకు వచ్చాయి. కొన్నింటిపై ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. రెండు దేశాలకు ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలనే మేము కోరుకుంటున్నాం. మంచి పురోగతి లభించింది’’ అని పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. అమెరికా, చైనాల ప్రకటనల తరువాత అమెరికా స్టాక్ ఇండెక్స్ ఫ్యూచర్స్ పెరిగాయి. ఎస్&పి 500 ఫ్యూచర్స్ 2.8శాతం, నాస్‌డాక్ 100 ఫ్యూచర్స్ 3.6శాతం, డౌ ఫ్యూచర్స్ 2.3శాతం పెరిగాయి.