విదేశాలకు వలసపోతున్నోళ్లలో మనోళ్లే టాప్ : యూఎన్ రిపోర్ట్

విదేశాలకు వలసపోతున్నోళ్లలో మనోళ్లే టాప్ : యూఎన్ రిపోర్ట్

Updated On : January 16, 2021 / 3:56 PM IST

India has the world”s largest diaspora population భారత్‌ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. శనివారం(జనవరి-16,2020) ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన “ఇంటర్నేషనల్ మైగ్రేషన్-2020 “రిపోర్ట్ ప్రకారం..2020 నాటికి భారత్‌ నుంచి 1 కోటీ 80 లక్షల మంది ప్రజలు వేరే దేశంలో నివసిస్తున్నారు.

భారత్‌ నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు అమెరికా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌, సౌదీ అరేబియాకు తరలివెళ్తున్నారని ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌ నుంచి వలస వెళ్లిన వారిలో అమెరికాలో 27 లక్షల మంది,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 30 లక్షల మంది, సౌదీ అరేబియాలో 25 లక్షల మంది నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, కువైట్, ఒమన్, పాకిస్థాన్​, ఖతార్, ఇంగ్లాండ్‌లోనూ అధిక సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది.

2000 నుంచి 2020 మధ్య విదేశాల్లో వలస జనాభా గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో భారత్‌ నుంచి అత్యధికంగా కోటి మంది విదేశాలకు వెళ్లగా… తర్వాతి స్థానాల్లో సిరియా, వెనిజువెలా, చైనా, ఫిలిప్పైన్స్ ఉన్నాయి. 2020 నాటికి 5 కోట్ల మందికిపైగా వలసదారులకు అమెరికా గమ్యస్థానంగా మారింది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని, ప్రపంచంలోని మొత్తం వలసల్లో ఇది 18 శాతమని నివేదిక తెలిపింది. అమెరికా తర్వాత జర్మనీ, సౌదీ అరేబియా, రష్యా, బ్రిటన్‌ దేశాలు వలసదారులకు ఎక్కువగా ఆతిథ్యమిచ్చాయి.

కరోనా నేపథ్యంలో జాతీయ సరిహద్దులను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వలసలు తగ్గాయని నివేదిక పేర్కొంది. కరోనా నేపథ్యంలో జాతీయ సరిహద్దులను మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2020లో వలసలు తగ్గాయని తెలిపింది. 2019 అంచనాల కంటే ఇది 27 శాతం తక్కువని తెలిపింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా 281 మిలియన్ల మంది వేరే దేశాల్లో స్థిరపడ్డారు. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 173 మిలియన్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపింది. భారత్‌, అర్మేనియా, పాకిస్థాన్, ఉక్రెయిన్, టాంజానియా దేశాలకు వలస వస్తున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని రిపోర్ట్ తెలిపింది.