Ayodhya Ram Mandir: నిరీక్షణ ముగియనుంది.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. పూర్తి వివరాలు ఇవే..
ప్రతీయేటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయ శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్ర తెలిపారు.

Recent pictures from Shri Ram Janmabhoomi Mandir construction site.
Ayodhya Ram Mandir Inauguration : భారతదేశంలోనేకాక ప్రపంచ వ్యాప్తంగా హిందువులు అయోధ్యలోని రాముడి ఆలయం ప్రారంభమయ్యేది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ త్వరలోనే ముగియనుంది. అయోధ్య రామ మందిర ప్రారంభ తేదీని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మూడంతస్తుల రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాన్ని డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేస్తామని, జనవరి 22న సంపోక్షణ కార్యక్రమాన్ని నిర్మిస్తామని నృపేంద్ర మిశ్రా తెలిపారు. జనవరి 15 నుంచి జనవరి 25వరకు పూజలు నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. అయితే, 2024 జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య జరిగే విగ్రహ ప్రాణప్రతిష్ఠ, ప్రారంభ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. అయితే, ప్రధాని ఏ రోజున స్వామివారి సేవలో పాల్గొంటారన్న అంశంపై పీఎంవో నుంచి స్పష్టమైన సమాచారం రావాల్సి ఉందని చెప్పారు.

Shri Ram Janmabhoomi Teerth Kshetra released latest Ram Temple Images
ఆలయ శిఖరంపై ప్రత్యేక నిర్మాణం..
ప్రతీయేటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలోని విగ్రహాలపై సూర్యకిరణాలు నిరంతరాయంగా ప్రసరించేలా ఆలయ శిఖరంపై ఓ ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నృపేంద్ర మిశ్ర తెలిపారు. బెంగళూరులో దీన్ని తయారు చేస్తున్నామని, దీని డిజైన్‌ను శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, పూణెలోని ఒక సంస్థ సంయుక్తంగా దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోందని చెప్పారు.

Recent pictures from Shri Ram Janmabhoomi Mandir construction site.
భక్తులకు అందుబాటులో ఎప్పుడంటే..
అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో ట్రస్ట్ ద్వారా రామ మందిర నిర్మాణానికి సుప్రీంకోర్టులో 2019లో మార్గం సుగమం అయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పుతరువాత రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పనులు తుదిదశకు చేరాయి. జనవరి 14న మకర సంక్రాంతి తరువాత రామ్‌లల్లా ప్రతిష్టాపన ప్రక్రియను ప్రారంభించి 10 రోజులపాటు రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట (పవిత్రం) నిర్వహించాలని ఆలయ ట్రస్ట్ నిర్ణయించింది. రామ్ లాలా విగ్రహ ప్రతిష్టాపన అనంతరం జనవరి 24న అయోధ్యలోని రామాలయాన్ని భక్తులకోసం తెరిచే అవకాశం ఉందని నృపేంద్ర మిశ్రా తెలిపారు.

Recent pictures from Shri Ram Janmabhoomi Mandir construction site.
ఇంటి నుంచి చూసే అవకాశం..
వచ్చే ఏడాది జనవరి నెలలో రామాలయం ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ నిర్మాణ కమిటీ భావిస్తుంది. అయితే, ఆలయం వద్దకురాలేని ప్రజలకోసం ఇంటి నుంచే వీక్షించేలా ‘ప్రాణ ప్రతిష్టా’ కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది.
మరోవైపు 136 సనాతన్ సంప్రదాయాలకు చెందిన 25000 మంది హిందూ మత పెద్దలను పవిత్రోత్సవానికి ఆహ్వానించాలని ట్రస్ట్ యోచిస్తోంది. ముడుపులకు హాజరయ్యే 25వేల మంది సాధువులతో పాటు, పదివేల మంది ప్రత్యేక అతిథులు కూడా ఉంటారు.