మాలధారణం.. నియమాల తోరణం : అయ్యప్ప స్వామి దీక్ష ప్రత్యేకత

శబరిమలైవాసుడు.. మణికంఠుడి దర్శనం కోసం మాల ధరించిన భక్తులు పయనమవుతున్నారు. అయ్యప్పని దర్శించేందుకు కఠినమైన మండల దీక్ష చేపట్టి.. విల్లాదివీరుని స్మరించుకుంటూ కేరళకు బయలుదేరుతున్నారు. ఇంతకీ స్వామి దీక్ష ప్రత్యేకత ఏంటి
హరిహర సుతుడు అయ్యప్ప దీక్షా కాలం కార్తీకమాసంతోనే ప్రారంభమై.. మకరజ్యోతితో పూర్తవుతుంది.. పద్దెనిమిది కొండల మధ్యలోని శబరిగిరి శిఖరంపై చిన్ముద్రధారిగా కొలువైన స్వామి దర్శనం కోసం దీక్ష చేపట్టే భక్తులు 41 రోజులు కఠిన నియమాలను ఆనందంగా చేపడతారు. అయితే మాల ధరించడానికి మహిళల విషయంలో ఆది నుంచీ నిబంధనలు పాటించడమనేది సంప్రదాయంగా వస్తోంది. రుతుచక్రం ఆగిపోయిన మహిళలు.. రజస్వల వయసులోని చిన్నారి బాలికలకు మాత్రమే మాల ధరించే అర్హత ఉన్నట్లుగా చెబుతారు. దీనికి మరో కారణం కూడా చెప్తారు.
అయ్యప్ప ఆజన్మ బ్రహ్మచారి కావడంతో ఆయనకు మహిళలు దూరంగా ఉంటారని అంటుంటారు. ఇప్పుడీ నియమంపైనే రగడ చోటు చేసుకుంది. ఈ విషయం సంగతి ఎలా ఉన్నా…అయ్యప్ప మాలను ధరించి దీక్ష చేసే భక్తులు నిత్యం స్వామినామ స్మరణలోనే గడుపుతారు. మాలధారణలో ఉన్న సమయంలో గృహస్థు జీవితానికి భిన్నంగా ఆహారం మారుతుంది. వ్యవహారాలు, భాష, వేషం..ఆలోచనలు..సంభాషణ అన్నీ సాత్విక ధోరణిలోనే సాగుతాయి. వీలైనంత వరకూ మహిళలకు దూరంగా ఉంటూ..శరణఘోషలతో.. భజనలతో స్వామిని పూజిస్తూ 41 రోజుల పాటు కఠిన దీక్ష చేస్తారు. దీక్షాకాలం పూర్తైన తర్వాత యాత్రకు బయలుదేరే అయ్యప్ప స్వాములు కేరళలోని కొండలు, దట్టమైన అడవుల గుండా ప్రకృతిలోపల పరవశిస్తూ సాగుతారు.
అయ్యప్ప చరిత్రలో పద్ధెనిమిదికి ఎంతో విశిష్టత ఉంది. అయ్యప్ప పద్ధెనిమిది కొండల మధ్యలో కొలువై ఉన్నాడు. పద్ధెనిమిది మెట్లు పద్ధెనిమిది తత్త్వాలకు, దేవతలకు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి. ఇంజిప్పారమల, కాళైకట్టి, పుదుచ్చేరి, కరిమల, తలైప్పారామల, దేవర్‌మల, శ్రీపాదమల, మైలాడుంమల, మాతంగమల, కాలిక్కిమల, చిత్తంబలమల, సుందరమల, నాగాంబలమల, గౌండమల, నీలక్కల్‌మల, పొన్నాంబలమల, శబరిమల వంటి వంటి 18 కొండలను పద్ధెనిమిది మంది దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు.
శబరి పీఠం తర్వాత మరక్కూటమ్ మీదుగా స్వాములు అయ్యప్ప సన్నిధిలోని పదునెట్టాంబడి చేరుతారు. చూడటం, వినడం, సువాసన, రుచి, స్పర్శ, కామం, క్రోధం, లోభం, మదం, మాశ్చర్యం, ఢాంబికం, సాత్వికం, రాజసం, తామసం, విద్య, అవిద్య వంటి 18 తత్త్వాల ఆధీనుడై స్వామి ఉన్నాడని తెలియజెప్పడమే అష్టాదశ సోపానాల పరమార్థం. అందుకే ఆ సోపానాలకు కొబ్బరికాయ కొడతారు. వాటికి సాష్టాంగ నమస్కారం చేసి అధిరోహిస్తారు. యోగముద్రలో ఉన్న స్వామిని దర్శించుకుని తరిస్తారు.
మాల ధరించిన భక్తులు శబరిగిరీశుడి దర్శనానికి వెళ్లే ముందు ఇరుముడి ధరిస్తారు. ఇరుముడిలో ప్రధానమైంది నెయ్యితో నింపిన టెంకాయ. అయ్యప్ప స్వామిని నెయ్యాభిషేక ప్రియుడని, కర్పూర ప్రియుడని అంటారు. అందుకే కొబ్పరికాయలో నీటిని తీసి, ఆవు నేతిని నింపుతారు. అలా నేతితో నింపిన టెంకాయను ఇరుముడిలో కట్టి శబరిమలకు చేరుకుంటారు. శబరిమలలో నెయ్యాభిషేకానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇరుముడితో పదునెట్టాంబడి ఎక్కి స్వామి దర్శనం చేసుకున్న భక్తులు తర్వాత జరిగే నెయ్యాభిషేకంలో పాల్గొంటారు. మండలం, మకరవిలక్కు సందర్భంగా ఈ క్రతువును రోజూ నిర్వహిస్తారు.
తెల్లవారుఝామున 4.15 గంటలకు ప్రారంభమయ్యే అగ్నిహోమం రాత్రి 11.30 గంటల వరకు నిరాటకంగా కొనసాగుతుంది. ఈ అగ్నిధారలతో శబరిగిరులు మరింత ఆధ్మాత్మికతను సంతరించుకుంటాయ్. ఇంతటి ఆధ్యాత్మిక ప్రక్రియ కలిగినది కావడంతోనే శబరిమల యాత్రకి భక్తులు లక్షల సంఖ్యలో వస్తుంటారు. మకరజ్యోతి దర్శనం తర్వాత తిరిగి అయ్యప్ప దర్శనం తిరిగి ఆయన జన్మనక్షత్రం రోజునే కలుగుతుంది.