స్వామి శరణం : తెరుచుకున్న అయ్యప్ప ద్వారాలు

స్వామియే శరణం అయ్యప్ప..ఘోషతో శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. శబరిమల ఆలయ తలుపులను అర్చకులు 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. 41 రోజుల మండల దీక్షల కోసం ఆలయం తెరుచుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సన్నిధానం దగ్గర భక్తులు పోటెత్తారు. డిసెంబర్ 27 వరకు నిత్యపూజలు జరుగుతాయి. అయ్యప్ప దర్శనానికి నవంబర్ 17వ తేదీ ఆదివారం నుంచి భక్తులకు అనుమతినిస్తారు.
వీరికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ..టెన్షన్..టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. స్వామి వారిని దర్శించుకుంటామని మహిళలు మరోసారి స్పష్టం చేయడం..వీరిని అడ్డుకుంటామని అయ్యప్ప భక్తుల సంఘాలు ప్రకటించడంతో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయ్యప్ప దర్శనం కోసం శబరిమల ఆలయానికి వెళుతున్న ఏపీకి చెందిన 10 మంది మహిళలను కేరళ పోలీసులు వెనక్కి పంపారు.
నిలక్కల్, పతనం తిట్ట, పంబాతో సహా ఆలయ పరిసర ప్రాంతాల్లో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది కేరళ ప్రభుత్వం. ఇక్కడకు వచ్చే మహిళలకు భద్రత కల్పించలేమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొని ఉంది. స్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవాల్సి ఉంటుంది.
నవంబర్ – డిసెంబర్ మండల చిరప్పు ప్రారంభం అవుతుంది. ఇందుకోసం కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్టలతో 41 రోజుల పాటు మండలదీక్షలు చేస్తారు. తర్వాత ఇరుముడిని కట్టుకుని శబరిమలకు వెళుతారు. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు…తదితరాలతో ఈ మూట ఉంటుంది. ఈ మూటను గురుస్వామి భక్తుల శిరస్సున ఉంచుతారు.
Read More : స్వామి శరణం అయ్యప్ప : పంబ దగ్గరకు చేరుకున్న మహిళలు