సిద్ధిఖీ హత్య కేసు: మైనర్‌నని చెప్పుకున్న నిందితుడు ధర్మరాజ్‌కు బోన్ ఆసిఫికేషన్ టెస్ట్.. ఏం తేలిందో తెలుసా?

కేసులో శిక్షల నుంచి తప్పించుకోవడానికి అతడు తనను తాను మైనర్‌గా చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

సిద్ధిఖీ హత్య కేసు: మైనర్‌నని చెప్పుకున్న నిందితుడు ధర్మరాజ్‌కు బోన్ ఆసిఫికేషన్ టెస్ట్.. ఏం తేలిందో తెలుసా?

Dharmaraj Kashyap

Updated On : October 14, 2024 / 8:15 AM IST

ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్ తాను మైనర్‌ని అని కోర్టులో చెప్పాడు. తన వయసు 17 ఏళ్లు మాత్రమేనని చెప్పడంతో అతడికి బోన్ ఆసిఫికేషన్ టెస్ట్ చేసి వయసుని నిర్ధారించాలని కోర్టు ఆదేశించింది. కొన్ని ఎముకల ఎక్స్-రేను తీసుకోవడం ద్వారా ఈ టెస్టులో వయస్సును నిర్ధారిస్తారు.

దీంతో ముంబై పోలీసులు నిందితుడు ధర్మరాజ్ కశ్యప్‌కు ఆసిఫికేషన్ టెస్ట్ నిర్వహించగా, అతను మైనర్ కాదని రుజువైనట్లు ఇవాళ ఒక అధికారి తెలిపారు. బాంద్రాలోని సబర్బన్‌లో బాబా సిద్ధిఖీని శనివారం ముగ్గురు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.

అందులో ఒకడే ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్. కేసులో శిక్షల నుంచి తప్పించుకోవడానికి అతడు తనను తాను మైనర్‌గా చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అతడు మైనర్‌ కాదని తెలియడంతో అతడిని కోర్టు అక్టోబరు 21 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించింది.

ముంబై పోలీసులు హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేశ్‌ కశ్యప్ (19)ను అరెస్టు చేశారు. అయితే కాల్పుల సమయంలో సంఘటనా స్థలంలో ఉన్న మరో నిందితుడు తప్పించుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ట్రంప్‌ ర్యాలీలో మరో కలకలం.. లోడ్‌ చేసిన గన్‌తో వచ్చిన వ్యక్తి