ట్రంప్ ర్యాలీలో మరో కలకలం.. లోడ్ చేసిన గన్‌తో వచ్చిన వ్యక్తి
కాలిఫోర్నియాలోని కోచెల్లాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Donald Trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మరో కలకలం చెలరేగింది. కొన్ని రోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనను మరవకముందే ఓ వ్యక్తి.. ట్రంప్ నిర్వహిస్తున్న ర్యాలీలోకి అక్రమంగా షాట్‌గన్, లోడ్ చేసిన తుపాకీని తీసుకొచ్చాడు.
అతడిని గుర్తించిన పోలీసులు ఆ ఆయుధాలను స్వాధీనం చేసుకుని, అతడిని అరెస్టు చేశారు. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి అరెస్టు గురించి తమకు తెలుసునని సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు.
శనివారం జరిగిన ఈ ఘటనలో ట్రంప్‌కి గానీ, ర్యాలీకి హాజరైన ఇతరులకుగానీ ఎలాంటి ప్రమాదమూ జరగలేదని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. నిందితుడు లాస్ వెగాస్‌కు చెందిన వెమ్ మిల్లర్(49)గా పోలీసులు గుర్తించారు. అతడు తరువాత బెయిల్‌పై విడుదలయ్యాడు. అతడు మళ్లీ జనవరి 2న కోర్టులో విచారణను ఎదుర్కొంటాడని పోలీసులు తెలిపారు.