Himachal Bank: దేవుడా.. భారీ వరద.. బ్యాంకంతా బురద.. ఇప్పుడు ఆ డబ్బు, గోల్డ్ పరిస్థితి ఏంటి?

జూన్ 20 నుంచి జులై 6న హిమాచల్ ప్రదేశ్‌లో 23సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

Himachal Bank: దేవుడా.. భారీ వరద.. బ్యాంకంతా బురద.. ఇప్పుడు ఆ డబ్బు, గోల్డ్ పరిస్థితి ఏంటి?

Updated On : July 7, 2025 / 6:21 PM IST

Himachal Bank: హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, గ్యాప్ లేకుండా కురుస్తున్న వానలతో హిమాచల్ ప్రదేశ్ చిగురుటాకులా వణికిపోతోంది. ఈ ప్రకృతి విపత్తులో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారింది.

భారీ వర్షాలకు అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. తాజాగా ఓ బ్యాంకుని భారీ వరద ముంచెత్తింది. దీంతో ఆ బ్యాంకులో దాచుకున్న తమ డబ్బులు, సొమ్ముల గురించి డిపాజిటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులోని డబ్బు, గోల్డ్ పరిస్థితి ఏంటో తెలియక కంగారు పడుతున్నారు.

మండి జిల్లాలోని తునాగ్ పట్టణంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు ఉంది. సమీప పట్టణాలకు చెందిన వ్యాపారులు, వందలాది మంది ఖాతాదారులు తమ సంపాదనను ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు. తమ డబ్బు, ఆభరణాలు, విలువైన పత్రాలను ఈ బ్యాంకులోనే ఉంచారు. తమ డబ్బు, సొమ్ములకు ఇదే సురక్షితమైన స్థలం అని ఖాతాదారులు నమ్మారు. అయితే, నెల రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ప్రభావం బ్యాంకుపై పడింది. వరద నీరు, కొట్టుకొచ్చిన శిథిలాలు బ్యాంక్‌ రెండు అంతస్తుల భవనంలోని మొదటి ఫ్లోర్‌ను ముంచెత్తాయి. దాంతో దాని షటర్లు దెబ్బతిన్నాయి.

Also Read: పాకిస్తాన్‌లో మరో సైనిక తిరుగుబాటు? జర్దారీ స్థానంలో అధ్యక్షుడిగా ఆసిమ్ మునీర్?

”ఈ బ్యాంకు రెండంతస్తుల భవనంలో ఉంది. అందులో మొదటి అంతస్తు వరద నీరు, శిథిలాలతో నిండి ఉంది. నీటి ప్రవాహం ఎంతగా ఉందంటే ఒక వైపు షట్టర్ పైకి లేచింది. మిగిలిన రెండు షట్టర్లు వంకరగా ఉన్నాయి. ఎంత నష్టం జరిగి ఉండొచ్చన్న దానిపై స్పష్టత లేదు. ఇందులో కోట్ల రూపాయల నగదు ఉంది. లక్షల విలువైన ఆభరణాలు కూడా ఉన్నాయి. శిథిలాలను తొలగించిన తర్వాతే నష్టాన్ని అంచనా వేసే అవకాశం ఉంది” అని బ్యాంకు అధికారులు చెబుతున్నారు.

తునాగ్ మార్కెట్ మధ్యలో ఉన్న ఈ బ్యాంకులో క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే 150 మంది వ్యాపారుల ఖాతాలు ఉన్నాయి. 8 వేల జనాభా ఉన్న పట్టణానికి ఇదే ఏకైక బ్యాంకు. ”ఇది చాలా పాత బ్యాంకు. ప్రతిరోజూ చాలా లావాదేవీలు జరుగుతాయి. అయితే, ప్రస్తుతం, బ్యాంకులో ఉంచిన నగదు, పత్రాలు, లాకర్లు అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి” అని స్థానికులు తెలిపారు. ఈ వరదల వల్ల కొట్టుకుపోయిన విలువైన వస్తువులు దొంగిలించబడే ప్రమాదం ఉన్నందున, కొంతమంది స్థానికులు బ్యాంకు దగ్గర కాపలా కాస్తున్నారు.

ఈ విపత్తుతో కోట్లాది రూపాయల నగదు, బంగారం డిపాజిట్లపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ‘‘మా ప్రాంతంలో ఉన్న బ్యాంక్ ఇదొక్కటే. చాలాకాలం నుంచి ఇది నడుస్తోంది. ఇందులో ప్రతిరోజు భారీ సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి. ఇప్పుడు అందులో ఉంచిన నగదు, బంగారం, పత్రాలు ఏమై ఉంటాయో’’ అని డిపాజిటర్లు ఆందోళన వ్యక్తంచేశారు.

జూన్ 20 నుంచి జులై 6న హిమాచల్ ప్రదేశ్‌లో 23సార్లు ఆకస్మిక వరదలు వచ్చాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటివరకు 78 మంది చనిపోయారు. 37 మంది గల్లంతయ్యారు.