టీవీ చూసినా, పాటలు విన్నా గుండ్లు గీస్తాం జాగ్రత్త : గ్రామపెద్దల ఫత్వా

టీవీ చూడకూడదు..సినిమాలు..సీరియల్స్ చూడకూడదు. పాటలు వినకూడదు, క్యారమ్స్ వంటి ఆటలు ఆడకూడదు, ఫోన్లు..కంప్యూటర్లు వాడకూడదు,లాటరీ టిక్కెట్లు కొనకూడదు, మ్యూజిక్ వినకూడదు..ఇవన్నీ ఏంటానుకుంటున్నారా? ఇవన్నీ ప్రజలపై విధించిన ఆంక్షలు.. ఈకంప్యూటర్ యుగంలో కూడా ఓ గ్రామంలోని పెద్దలు గ్రామస్తులకు విధించిన ఆంక్షలివి.
పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో 12,000 జనాభాతో అద్వైత నగర్ గ్రామ పెద్దలు గ్రామస్థులకు ఈ వింత ఫత్వా జారీచేశారు. తాము విధించిన ఆంక్షలు ఉల్లంఘిస్తేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
‘పాటలు వినడం హరామ్, టీవీ చూడటం కూడా హరామే.. కాబట్టి వాటిని చూడవద్దు. ఒకవేళ మత పెద్దల మాటను పట్టించుకోకుండా టీవీ చూసినా, పాటలు విన్నా వారికి జరిమానాలు విధిస్తాం, కఠిన శిక్షలు అమలు పరుస్తాం’ అంటూ పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు ఫత్వా జారీచేశారు.
అంతేకాదు ఏమేమి చేయకూడదో ఓ లిస్టును కూడా ఫత్వాలో వెల్లడించారు. వారు జారీచేసిన ఫత్వాలో వారు నిషేధించిన వాటిని పొందు పరిచారు. క్యారమ్స్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలను హరామ్ కింద జమకట్టారు. ఆగస్టు 9న సామాజిక సంస్కరణల కమిటీ ఈ ఫత్వాను రూపొందించింది.
ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. గంజిళ్లు తీయాలు. అంతేకాదు వారికి గుండు కూడా గీయిస్తాం.. ఈ శిక్షలతో పాటు రూ.500 నుంచి రూ.7000 వరకు జరిమానాల చిట్టాను ఫత్వాలో పొందు పరిచారు. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తము సమాచారం అందిస్తే..వారికి నేరం స్వభావాన్ని బట్టి రూ.200-2,000 వరకు రివార్డును కూడా ఇస్తామని కమిటీ వెల్లడించింది. ఈ ఫత్వాకు వారు సరిపుచ్చుకుని చెప్పేది ఒకటే.. యువతరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా నిలువరించేందుకే వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ స్పష్టంచేసింది.
ఈ ఫత్వాపై కమిటీ అధికారుల్లో ఒకరైన అజారుల్ మాట్లాడుతూ..ఎవరైనా మద్యం అమ్మినట్లుగా తెలిస్తే రూ.7వేలు జరిమానా విధిస్తామని తెలిపారు. నేటి యువత పలు రకాల వ్యసనాలకు బానిసలవుతున్నారని అందుకే ఇటువంటి నిబంధనలతో కూడిన ఫత్వా జారీ చేశామని తెలిపారు. దీని గురించి తృణముల్ కాంగ్రెస్ ఆధిపత్యం కలిగిని వాసైపైకర్ పంచాయితీ ప్రధాన్ అబ్దుర్ రౌఫ్ మాట్లాడుతూ..నాకు ఈ ఫత్వాలో ఏమీ తప్పుగా అనిపించలేదని తెలిపారు.
ఫత్వాలో కమిటీ సూచించిన శిక్షల జాబితా ఇలా ఉంది..
టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగిస్తే.. రూ.1,000 జరిమానా
క్యారమ్ బోర్డు ఆడితే.. రూ.500 జరిమానా
లాటరీ టిక్కెట్ కొంటే.. రూ.2,000 జరిమానా
మద్యం అమ్మినా, కొన్నా.. రూ.7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు
లాటరీ టికెట్లను అమ్మితే..: రూ.7,000 జరిమానా
మద్యం సేవిస్తే.. రూ.2,000 జరిమానా, 10 గుంజిళ్లు
గంజాయి కొంటే.. రూ.7,000 జరిమానా
కాగా..షంషర్ గంజ్ బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ జాయ్ దీప్ చక్రవర్తి మాట్లాడుతూ..ప్రజలపై ఆంక్షలు విధిస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.