Bhajan Lal Sharma: సర్పంచ్ నుంచి సీఎంగా.. గెలిచిన మొదటిసారే పెద్ద పదవి.. రాజస్థాన్ కొత్త సీఎం విశేషాలివి
2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శర్మ సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో అమిత్ షా నుంచి స్ఫూర్తి పొందారట.

తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భజన్‌లాల్ శర్మ.. ఈరోజు (శుక్రవారం) రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వారం ప్రారంభంలో శాసనసభా పక్ష సమావేశానికి ముందు బీజేపీ కార్యాలయంలో తీసిన గ్రూప్ ఫోటోలో చివరి వరుసలో భజన్ లాల్ శర్మ కనిపించారు. ఒక గంట తర్వాత ఆయనే రాజస్థాన్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైనట్లు బీజేపీ ప్రకటించింది. ఆ తర్వాత ప్రధాన వేదికపై కనిపించారు.
రామమందిర ఉద్యమంలో
బీజేపీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి అయిన ఆయన జైపూర్‌లోని సంగనేర్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీలో తక్కువ ప్రొఫైల్ ఉంది ఆయనకి. ఆయనను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పరిగణిస్తారు. అయోధ్య రామ మందిర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇందుకోసం 1992లో జైలుకు కూడా వెళ్లారు. ఆ క్షణమే ఆయన రాజకీయ జీవితానికి నాంది. 27 ఏళ్ల నుంచి రెండు సార్లు గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM), పార్టీల్లోని వివిధ హోదాల్లో పనిచేశారు. భరత్‌పూర్ జిల్లాలోని అత్తారి గ్రామం, నద్‌బాయి పట్టణంలోని పాఠశాలల్లో చదివారు.
ఇది కూడా చదవండి: రూ.353.5 కోట్ల డబ్బుల కట్టలు స్వాధీనం.. దాచిన బంగారాన్ని ఇప్పుడు ఎలా గుర్తిస్తున్నారో తెలుసా?
కశ్మీరీ పండిట్లకు మద్దతుగా మార్చ్
ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో శర్మ చేరారు. నబడి, భరత్‌పూర్‌లలో సామాజిక సమస్యలను లేవనెత్తిన ఘనత ఉంది. 1990 నాటి ఏబీవీపీ నిరసనలలో శర్మ చురుకుగా పాల్గొన్నారు. దీనిలో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు శ్రీనగర్ వైపు కవాతు చేయడానికి జమ్మూలో గుమిగూడారు. అయితే, ఆ సమయంలో అధికారులు వారిని అడ్డుకున్నారు. లోయలో కాశ్మీరీ పండిట్‌లపై దాడులకు నిరసనగా ఉధంపూర్‌లో అరెస్టయిన వారిలో భజన్‌లాల్ శర్మ కూడా ఉన్నారు. ఆ తర్వాత భజన్‌లాల్ శర్మ.. బీజేపీ యువజన విభాగం (BJYM)లో చేరారు. భరత్‌పూర్ జిల్లా కార్యదర్శిగా, మాతృ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మారడానికి ముందు, అతను మూడుసార్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. భరత్‌పూర్‌ను వదిలి రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన శర్మ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
ఇది కూడా చదవండి: బిహార్‌లో అచ్చం అతీక్ అహ్మద్ లాంటి హత్య.. కోర్టుకు వెళ్తుండగా ఛోటే సర్కార్‌ను కాల్చేశారు
జైపూర్ కార్యాలయంలో చాలా కాలం ముఖ్య పాత్ర
రాజకీయ శాస్త్రంలో శర్మ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. వ్యవసాయ సామాగ్రి వ్యాపారాన్ని నడుపుతున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీల్లో ‘నిశ్శబ్ద’, ‘క్రమశిక్షణ కలిగిన’ కార్యకర్తగా పేరు పొందారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో, పార్టీ అధ్యక్షులు అశోక్ పర్నామి, మదన్ లాల్ సైనీ, సతీష్ పూనియా, సీపీ జోషి మారుతూనే ఉన్నారు. కానీ శర్మ మాత్రం రాష్ట్ర కార్యాలయంలో ఏదో పదవిలో ఉండిపోయారు.
అమిత్ షా ప్రభావం
మథురలో జరిగే గోవర్ధన్-గిరిరాజ్ పరిక్రమకు ఆయన నిత్యం హాజరవుతారని, అక్కడ ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరవుతున్నారని, అక్కడ వారిద్దరూ కలిసేవారని పార్టీ నేతలు చెబుతున్నారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు శర్మ సహాయకుడిగా పనిచేశారు. ఆ సమయంలో అమిత్ షా నుంచి స్ఫూర్తి పొందారట.
ఇది కూడా చదవండి: మొన్నటి పార్లమెంట్ దాడికి ప్లాన్-బీ కూడా ఉందట!
రాజస్థాన్‌లో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు పోలింగ్ జరగగా, అందులో 115 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత సీఎం పదవికి పార్టీ ఎవరిని ఎంచుకుంటుంది అనే ఊహాగానాలకు బీజేపీ తెరలేపింది. ఈరోజు శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీలో వసుంధర రాజే, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనుభవజ్ఞులు సీఎం పదవికి ముందంజలో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. అయితే భజన్‌లాల్ శర్మను సీఎంగా ఎన్నుకుని అన్ని ఊహాగానాలకు స్వస్తి పలికారు.