ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు

ఈ కేసుతో కేజ్రీవాల్ కు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదు చేసినప్పుడు అందులో కేజ్రీవాల్ పేరు లేదు, అలాగే నేరుగా కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు

Cm Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్. ఆయనకు బెయిల్ మంజూరైంది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లక్ష రూపాయల పూచీకత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఎం కేజ్రీవాల్ రేపు తిహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్ లో లంచం తీసుకున్నారని సీఎం కేజ్రీవాల్ పై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఇది భారీ ఊరటగా చెప్పొచ్చు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. 3 నెలల సమయానికి ఆయనకు బెయిల్ లభించింది. ఈ కేసుతో కేజ్రీవాల్ కు ఎటువంటి సంబంధం లేదు, కేసు నమోదు చేసినప్పుడు అందులో కేజ్రీవాల్ పేరు లేదు, అలాగే నేరుగా కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లపై నిన్న, ఇవాళ విచారణ జరిగింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను ఈడీ తరపు న్యాయవాది, అడిషనల్ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు.

కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, లిక్కర్ పాలసీ లబ్ది పొందిన వ్యాపారస్తులు కేజ్రీవాల్ కు ముడుపులు అందజేశారని కోర్టుకు తెలియపరిచారు. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆప్ లబ్ది పొందిందని, సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల ముడుపులు అందాయని, అందులో కొంత మొత్తాన్ని గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించుకుందని, కేజ్రీవాల్ హోటల్ బిల్స్ కు ఆ ముడుపుల నుంచే చెల్లించారని ఈడీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే కేజ్రీవాల్ తన మొబైల్ పాస్ వర్డ్ చెప్పడం లేదన్నారు. ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతోందని, కాబట్టి కేజ్రీవాల్ కు బెయిల్ ను వ్యతిరేకిస్తున్నామని ఈడీ లాయర్ వాదించారు.

అయితే, కేజ్రీవాల్ తరుపు న్యాయవాది వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకుంది. నిందితుల వాంగూల్మాల ఆధారంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిందని, కానీ అప్రూవర్లుగా మారిన నిందితులు మొదట ఇచ్చిన స్టేట్ మెంట్స్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా లేవని వాదించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. కాగా, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈడీ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్ట్ మొదటి నుంచి కూడా ఈడీ సమర్థించుకుంటూ వస్తోంది. చట్టబద్ధంగానే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా జరగలేదని, కేజ్రీవాల్ ప్రమేయం ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయని ఈడీ వాదిస్తోంది.

Also Read : ఢిల్లీలో ఎండ దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం.. 192 మంది నిరాశ్రయులు మృతి