వైరల్ వీడియో: కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతుండగా కుప్పకూలిన స్టేజ్!

  • Published By: vamsi ,Published On : October 30, 2020 / 02:08 PM IST
వైరల్ వీడియో: కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతుండగా కుప్పకూలిన స్టేజ్!

Updated On : October 30, 2020 / 2:13 PM IST

బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి సాగుతుండగా.. దర్బంగాలో ప్రచార వేదికపై జేల్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మస్కూర్‌ అహ్మద్‌ ఉస్మాని ప్రసంగిస్తుండగా ఆ వేదిక ఒక్కసారిగా కూలి పైన ఉన్న అందరూ కిందపడిపోయారు. ఉస్మాని సహా వేదికపైన ఉన్నవారంతా స్టేజ్‌ కూలిపోవడంతో కిందపడిపోగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్  మీడియాలో వైరల్ అవుతుంది.



ఈ ఘటనలో ఎవరికీ గాయాలైన సమాచారం బయటకు రాలేదు. ఈ వీడియోలో ఉస్మాని మాస్క్‌ లేకుండా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కనిపించగా.. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇక బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సీపీఐ ఎంఎల్‌, సీపీఎం, సీపీఐలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమిగా జట్టు కట్టి బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీష్‌ కుమార్‌ సారథ్యంలోని ఎన్డీయే కూటమితో సై అంటూ ఎన్నికల సమరంలో దిగింది.



బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు తొలి విడత పోలింగ్‌ అక్టోబర్‌ 28న ఇప్పటికే ముగియగా, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో మలి, తుది విడత పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.