గొప్ప మనస్సు : జవాన్ పిల్లలను దత్తత తీసుకున్న మహిళా IAS

  • Published By: veegamteam ,Published On : February 19, 2019 / 06:10 AM IST
గొప్ప మనస్సు : జవాన్ పిల్లలను దత్తత తీసుకున్న మహిళా IAS

కాలం ఎలా ఉందండీ.. దోచుకుతినే రోజులు ఇవి. మనిషన్నవాడు మాయం అవుతున్నాడు అని అనుకుంటున్న రోజులు.. ఇలాంటి సమయంలో ఓ లేడీ కలెక్టర్ తన గొప్ప మనస్సు చాటుకున్నారు. పుల్వామా టెర్రర్ ఎటాక్ లో చనిపోయిన జవాన్ కుటుంబాలకు అండగా ఉన్నారు. చేతిలో ఉన్న పవర్ తో.. చేయాల్సినంత సాయం చేస్తూనే.. సొంత డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. డబ్బులు ఇస్తే ఏముంటుందీ.. నాలుగు రోజుల తర్వాత మర్చిపోతారు అనుకున్న ఈ మహిళా కలెక్టర్.. జవాన్ పిల్లలను దత్తత తీసుకున్నారు. ఇద్దరు చిన్నారుల చదువు బాధ్యతను తీసుకుని.. వారి బాగోగులను తన సొంత డబ్బులతో చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డైనమిక్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ గానే కాకుండా.. గొప్ప మనస్సున్న అధికారిగా మనన్నలు పొందుతోందీ ఇనాయత్ ఖాన్. 

ఇప్పటికే ఎందరో ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వారికి అండగా నిలవగా తాజాగా ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కూడా తన వంతుగా సైనికుల కుటుంబాలకు సాయపడేందుకు ముందుకు వచ్చారు. బీహార్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఇనాయత్ ఖాన్.. పుల్వామా దాడిలో చనిపోయిన ఇద్దరు సైనికుల ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది. చనిపోయిన రతన్ కుమార్, సంజయ్ కుమార్ సిన్హాల కుమార్తెల పూర్తి భాధ్యతలను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వారి జీవితాంతం చదువుకు, ఇతర అవసరాలకు ఎంత ఖర్చు అయినా తనే భరించనున్నట్లు ఆమె వెల్లడించారు.  

 

రెండు కుటుంబాల కోసం విరాళాల సేకరణ చేస్తున్నామని, మార్చి 10వ తేదీ వరకు ఎంత మొత్తం వస్తే అంత మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి ఇద్దరి కుటుంబాలకు పంచుతానని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఎవరికి వీలైనంత వారు విరాళాలుగా అంజేయాలని కోరారు. ఐఏఎస్ ఆఫీసర్ చేసిన పనికి స్థానికంగా ప్రశంసలు వెళ్లువెత్తుతున్నాయి. దేశంలోని వ్యాపారులు, ప్రముఖులు ఇదే విధంగా ముందుకు రావాలంటున్నారు నెటిజన్లు.