బిల్కిస్ బానో కేసు : రూ. 50 లక్షలు ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి – సుప్రీం

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాధితురాలికి నష్టపరిహారం కింద రూ. 50 లక్షలు ఇవ్వాలని, బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి..రెండు వారాల్లోపు చెల్లించాలని ఆదేశాల్లో వెల్లడించింది. ఒకవేళ గడువులోగా ప్రభుత్వం దీనిని అమలు చేయకపోతే మాత్రం..కోర్టు ధిక్కారణగా భావిస్తామని తెలిపింది. అంతేగాకుండా నివాసం కూడా కల్పించాలని సూచించింది. 2002లో గుజరాత్ అల్లర్లలో బిల్కిస్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం సుప్రీంకోర్టు దీనిని విచారించింది. ఏప్రిల్ ఉత్తర్వులను పున: పరిశీలించాలని గుజరాత్ చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. పరిహార పథకం ఇప్పటికే రాష్ట్రంలో ఉందని గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది వెల్లడించగా..ఇంతకుముందు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదని అభిప్రాయ పడింది. అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదారి పట్టించేలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ భగోరాపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని సూచించింది.
2002, మార్చి 03వ తేదీన గోద్రా అనంతరం అల్లర్ల సమయంలో అహ్మాదాబాద్ సమీపంలోని రందీక్ పూర్ గ్రామంలో బిల్కిస్ బానో కుటుంబంపై ఓ గుంపు దాడికి పాల్పడింది. ఐదు నెలల గర్బవతి అయిన బిల్కిస్‌పై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆమె కుటుంబంలోని పలువురు మృతి చెందారు. అప్పటి నుంచి కోర్టులో కేసు కొనసాగుతూ వస్తోంది. ఆమెపై అత్యాచారం, కుటుంబసభ్యుల్లోని ఏడుగురిని హత్య చేసినందుకు 11 మంది వ్యక్తులకు ప్రత్యేక కోర్టు దోషులుగా గుర్తించి..జీవిత ఖైదు (2008 జనవరి 21) విధించింది. 2017, మే 04వ తేదీన కేసులో సక్రమంగా విధులు నిర్వహించ లేదని ఏడుగురు వ్యక్తులు, ఐదుగురు పోలీసులు, ఇద్దరు వైద్యులను దోషుగా నిర్దారించింది.
Read More : బెయిల్ ఇచ్చేది లేదు : చిదంబరానికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు