రాజస్తాన్ లో “ఫోన్ ట్యాపింగ్” దుమారం..సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్

జస్థాన్​లో ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై దుమారం చెలరేగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం గతేడాది రాజస్తాన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఎమ్మెల్యేల ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన విషయం తెలిసిందే.

రాజస్తాన్ లో “ఫోన్ ట్యాపింగ్” దుమారం..సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్

Bjp Demands Ashok Gehlots Resignation Over Phone Tapping Allegations

Updated On : March 16, 2021 / 9:59 PM IST

Phone Tapping రాజస్థాన్​లో ఫోన్​ ట్యాపింగ్​ అంశంపై దుమారం చెలరేగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశం గతేడాది రాజస్తాన్‌లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఎమ్మెల్యేల ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారనే ఆరోణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ కేంద్రమంత్రికి మరియు రాజస్తాన్ కాంగ్రెస్ నేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు బయటికిరావడం అ్పపట్లో దుమారం రేపింది. అయితే తాము ఎలాంటి పోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని ఆ సమయంలో గెహ్లాట్ ప్రభుత్వం చెప్పింది.

అయితే, తాజాగా తమ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గెహ్లాట్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని రాజస్తాన్‌ అసెంబ్లీ వెబ్‌సైట్‌లో చేర్చింది. సీనియర్‌ బీజేపీ నాయకుడు,మాజీ ఆరోగ్యశాఖ మంత్రి కాళిచరణ్‌ గతేడాది అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు బదులుగా రాజస్తాన్‌ అసెంబ్లీ వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పోస్ట్‌ చేసింది. ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవమేనా..ఒకవేళ నిజమే అయితే ఏ చట్టం కింద, ఎవరి ఆదేశాల మేరకు ట్యాప్ చేశారు. ఈ వివరాలను అసెంబ్లీ టేబుల్ మీద పెట్టండి అని బీజేపీ ఎమ్మెల్యే కాళిచరణ్ షరాఫ్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ..ప్రజా ప్రయోజనార్థం, ప్రజల భద్రత కోసం, శాంతి భద్రతలకు భంగం కలిగించగల నేరాలను అడ్డుకునేందుకు టెలీఫోన్లను నియంత్రించడం జరిగింది. భారత టెలీగ్రాఫ్ చట్టం-1885లోని సెక్షన్ 5(2), భారత టెలీగ్రాఫ్ సవరణ చట్టం 2007, ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69 కింద సంబంధిత అధికారి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. సంబంధిత అధికారి నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే పై చట్టాల కింద రాజస్తాన్ పోలీసులు టెలీఫోన్లను నియంత్రించారంటూ చెప్పుకొచ్చింది. అయితే ఏయే నంబర్లతో ఉన్న ఫోన్లను ఇంటర్‌సెప్ట్ చేశారు.. ఎప్పుడు వాటిపై నిఘా పెట్టారు అనే వివరాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.

అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్-కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మద్దతుదారుల ఫోన్లను గెహ్లాట్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని దీనిపై సీబీఐ విచారణ జరగాలని బీజేపీ డిమాండ్ చేసింది. దేశ బలోపేతం కోసమో, ఉగ్రవాదులను పట్టుకోవడం కోసమో కాకుండా.. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గెహ్లాట్ ప్రభుత్వం ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడుతోందని బీజేపీ ఎంపీ రాజవర్ధన్​ సింగ్ రాఠోడ్ విమర్శించారు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫోన్​ ట్యాపింగ్ చేయాల్సి వస్తే ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.

బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్​ తోసిపుచ్చింది. తాము ఎంపీలు, ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్​ చేయమని రాజస్థాన్​ మంత్రి ప్రతాప్ సింగ్​ ఖాచారియావాస్​ తెలిపారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్రలు పన్నే వారే అలా చేస్తారని దీటుగా బదులిచ్చారు. కర్ణాటక, మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వాలను అలాగే పడొగట్టారని, రాజస్థాన్ ​లోనూ ఆ కుట్ర జరిగిందని దుయ్యబట్టారు. కేంద్రమంత్రి, బీజేపీ నేత సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒకవేళ వారు నిజాయితీపరులైతే ఆ ఆడియో క్లిప్​లోని స్వరం​​ తమది కాదని సుప్రీంకోర్టును ఆశ్రయించి, నిజాలు ప్రపంచానికి తెలియజేయవచ్చునని అన్నారు.

ఇక,గహ్లోత్‌ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అంగీకిరంచడంతో ప్రస్తుతం అందరి దృష్టి సచిన్‌ పైలట్‌ మీదనే ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు నిజమని తెలితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని గతంలో గహ్లోత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సచిన్‌ పైలట్‌ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తారా.. లేక మన్నించి వదిలేస్తారా అనే అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సచిన్‌ దీనిపై ఇంతవరకు స్పందించలేదు.