బెంగాల్ కు 30వేల మంది బీజేపీ వాలంటీర్లు..ఎందుకో తెలుసా!

పౌరసత్వ సవరణ చట్టం(CAA)వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అసోం,పశ్చిమబెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చే దిశగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 30వేల మంది వాలంటర్లీను నియమించుకున్న బీజేపీ…వారిని వెస్ట్ బెంగాల్ కు పంపి ప్రజలకు సీఏఏ గురించి వివరించేలా చేయాలని డిసైడ్ అయ్యింది.
బీజేపీ నియమించిన ఈ వాలంటీర్లందరూ వెస్ట్ బెంగాల్ లో ఇంటింటికి వెళ్లి సీఏఏ గురించి ప్రజలకు వివరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి చివరికళ్లా ఈ కార్యక్రమాన్ని బీజేపీ అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుననట్లు సమాచారం. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సీఏఏకు మద్దతిస్తున్నట్లు ప్రజలు చెబుతున్న విషయాలకు సంబంధించిన లేఖలు కూడా ప్రధాని మోడీకి పంపించబడనున్నాయి. ఇదే విషయమై శుక్రవారం(డిసెంబర్-27,2019) బీజేపీ మహిళా విభాగం సమావేశం కానుంది.
ప్రతిపక్షాలకు కౌంటర్ గా సీఏఏకు మద్దతుగా నాగ్ పూర్,ముంబై,కోల్ కతాలో ఇప్పటికే బీజేపీ భారీ ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సీఏఏ విషయంలో ప్రజలను తప్పుదోప పట్టిస్తున్నాయని,సీఏఏ దేశంలోని ముస్లింలకు వ్యతిరేకం కాదని ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అసలు సీఏఏను ఒక్కసారి పూర్తిగా చదవాలని ప్రధాని ప్రజలను కోరారు.
సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరప్రదేశ్,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 144సెక్షన్ కొనసాగుతూనే ఉంది. యూపీలో ఆందోళనలో పాల్గొన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే అనధికారికంగా ఆ సంఖ్య 11వరకు ఉంటుందని సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా పలుచోట్ల వందలాది మంది ఆందోళనల్లో పాల్గొన్ని తీవ్రగాయాలతో హాస్పిటల్ పాలయ్యారు.