Bus Accident : మరో ఘోర బస్సు ప్రమాదం.. బోల్తా పడిన టూరిస్టు బస్సు .. ఒకరు మృతి.. 45మందికిపైగా గాయాలు
Bus Accident : బస్సు ప్రమాదం సమయంలో ఇద్దరు డ్రైవర్లు సహా 49మంది ఉన్నారు. ఈ బస్సులో దర్శనీయ స్థలాలను సందర్శించడానికి వెళ్లిన వ్యక్తుల బృందం ఉంది.
Bus Accident
Bus Accident : కర్నూల్ జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఘటనలో 19మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో బస్సు ప్రమాదం జరిగింది. కేరళలోని కొట్టాయంలో టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 45మందికి గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కొట్టాయం ఎంసీ రోడ్డులోని కురవిలంగాడ్ వద్ద టూరిస్టు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కన్నూర్ ఇరిట్టికి చెందిన సింధు (45) మరణించింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు మలుపు తీసుకుంటుండగా నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. కర్నూర్ లోని ఇరిట్టి నుండి తిరువనంతపురంకు బస్సు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు ప్రమాదం సమయంలో ఇద్దరు డ్రైవర్లు సహా 49మంది ఉన్నారు. ఈ బస్సులో దర్శనీయ స్థలాలను సందర్శించడానికి వెళ్లిన వ్యక్తుల బృందం ఉంది. బస్సులోని వారంతా గాయపడ్డారు. గాయపడిన వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు. మిగిలిన వారిని మోనిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
