Dharamshala : జలదిగ్బంధంలో ధర్మశాల..వరదలో కొట్టుకుపోయిన కార్లు

ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి.

Dharamshala :  జలదిగ్బంధంలో ధర్మశాల..వరదలో కొట్టుకుపోయిన కార్లు

Dharmasala

Updated On : July 12, 2021 / 9:41 PM IST

Dharamshala ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు సంభవించాయి. ముఖ్యంగా ధర్మశాలలో ఆదివారం కుండపోత వర్షంతో కొన్ని ప్రాంతాలు అతాలకుతలమవుతున్నాయి. భాగ్సు ప్రాంతంలో రోడ్లు జలమయమయ్యాయి. భాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. దీంతో వరద ధాటికి పలు ఇళ్లు కూలిపోయాయి. కొన్ని హోటళ్లు ధ్వంసమయ్యాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలకు రోడ్లపై పార్క్ చేసి ఉన్న కార్లు కొట్టుకుపోయాయి. స్థానికులు ఈ వీడియోలను తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియోలు వైరల్‌గా మారాయి.

ధర్మశాలకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్రా జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. దీంతో జవజీవనం అస్తవ్యస్తమయ్యింది. వీధుల్లో వరద నీరు నదులను తలపించింది. ఈ ప్రాంతంలోని కొన్ని హోటళ్లకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అధికారులు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు ఉత్తరభారత్‌లోని చాలా రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల పిడుగులు పడి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.