పెద్ద ఎత్తున సైబర్‌ దాడులు.. జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరికలు

  • Published By: vamsi ,Published On : June 21, 2020 / 07:14 AM IST
పెద్ద ఎత్తున సైబర్‌ దాడులు.. జాగ్రత్తగా ఉండండి: కేంద్రం హెచ్చరికలు

Updated On : June 21, 2020 / 7:14 AM IST

వ్యక్తిగత డేటా మరియు ఆర్థిక సమాచారాన్ని దొంగిలించడానికి COVID-19 మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వ సేవల పేరిట దేశంలో నేటి నుంచి అతి పెద్ద సైబర్ దాడులు జరగొచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వెల్లడించింది. వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.

ncov2019@gov.in వంటి ఈ-మెయిల్స్‌ను వినియోగిస్తూ ఇటువంటి చర్యకు పాల్పడవచ్చని భారతీయ కంప్యూటర్, అత్యవసర స్పందన సంస్థ(సెర్ట్ ఇన్‌) ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం CERT-In ట్వీట్ చేసింది. సైబర్ బెదిరింపుల నుండి భారతీయులను రక్షించడానికి సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CERT-In పనిచేస్తుంది. కరోనాకు సంబంధించిన విషయాలను చూపుతూ, మభ్యపెడుతూ దేశంలోని వ్యక్తులు, సంస్థల సమాచారాన్ని హ్యాకర్లు చోరీ చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది.

సర్కారు తరఫున ఆర్థిక సహాయంగా నగదు అందించే ప్రభుత్వ సంస్థలు, విభాగాల పేరిట హ్యాకర్లు దేశంలో ఫిషింగ్‌ దాడులకు దిగే అవకాశం ఉందని చెప్పింది. భారత ప్రభుత్వ అధికారుల పేర్లతో నకిలీ ఈ-మెయిల్స్‌ పంపే అవకాశం ఉన్నట్లుగా చెప్పింది కేంద్రం. ఇటువంటి ఈ-మెయిల్స్‌ వస్తే వాటిని క్లిక్‌ చేయొద్దని స్పష్టం చేసింది.

హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉచిత కరోనా పరీక్షల పేరుతో లక్షలాది మందికి ఈ-మెయిల్స్‌ పంపాలని హ్యాకర్లు ప్రణాళిక వేసుకున్నట్లు తెలిపింది. తెలిసిన వ్యక్తుల పేరిట వచ్చిన మెయిల్స్‌లోని యూఆర్ఎల్‌లను కూడా క్లిక్‌ చేయొద్దని హెచ్చరించింది. హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు యాంటీ వైరస్‌ టూల్స్‌ వంటి సేవలను వాడుకోవాలని చెప్పింది.

ప్రజలు తమ పరిచయాల జాబితాలోని వ్యక్తుల నుంచి వచ్చినప్పటికీ, అయాచిత ఈ-మెయిల్‌లలో అటాచ్‌మెంట్‌లను తెరవవద్దని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది. లింక్ నిరపాయంగా అనిపించినప్పటికీ, వారు అయాచిత ఈ-మెయిల్‌లోని URL లపై క్లిక్ చేయవద్దని ఇది తెలిపింది.

Read:  భర్తను భుజాలపై ఎక్కించుకుని తిరగాలి..అత్తింటి వారి శిక్ష