ఆమె బుగ్గలు..మా రోడ్లు : హేమామాలినీపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

సీనియర్ కాంగ్రెస్ లీడర్.చత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దమ్తారీ జిల్లాలోని కుర్ద్ డెవలప్ మెంట్ బ్లాక్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కవాసీ లక్మా తన నియోజకవర్గంలోని రోడ్లను హేమామాలినీ చంపలతో పోల్చారు.
కవాసీ లక్మా మాట్లాడుతూ…నేను నక్సల్స్ ప్రభావిత ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. కానీ ఆ ప్రాంతంలోని రోడ్లన్నీ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని చెంపల మాదిరిగా నిర్మించాను అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. లఖ్మా వెంటనే క్షమాపణలు చెప్పాలని కుర్ద్ బీజేపీ ఎమ్మెల్యే,మాజీ మంత్రి అజయ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. లఖ్మా వ్యాఖ్యలు కాంగ్రెస్ మైండ్ సెట్ ను తెలియజేస్తున్నట్లు దమ్తరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాము రొహ్రా విమర్శించారు. ఓ మహిళా ఎంపీపై ఇలాంటి కామెంట్స్ తీవ్రంగా ఖండించదగినదని ఆయన తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని మథుర లోక్ సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా హేమమాలినీ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. గతంలో పాఠశాలలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న లఖ్మా.. విద్యార్థులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ గొప్ప రాజకీయ నాయకుడు కావాలనుకుంటే కలెక్టర్, ఎస్పీల కాలర్‌లు పట్టుకోవాలంటూ విద్యార్థులకు ఉచిత సలహా ఇచ్చిన విషయం తెలిసిందే.