ఓలి స్వార్థం..2దేశాల గొడవ : భారత్-నేపాల్ సరిహద్దు వివాదం వెనుక ముఖ్య కారణం ఇదే

  • Published By: venkaiahnaidu ,Published On : May 22, 2020 / 10:15 AM IST
ఓలి స్వార్థం..2దేశాల గొడవ : భారత్-నేపాల్ సరిహద్దు వివాదం వెనుక ముఖ్య కారణం ఇదే

Updated On : May 22, 2020 / 10:15 AM IST

ఇన్నాళ్లు మంచి స్నేహితులుగా ఉన్న నేపాల్-భారత్ ల మధ్య ఇప్పుడు మాటల యుద్దం కొనసాగుతోంది. భారత్ కు సరిహ‌ద్దుల్లో ఉన్న దేశాల్లో నేపాల్‌ తో మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా రెండు దేశాల మ‌ధ్య మంచి మైత్రి కొన‌సాగుతోంది. చిన్న దేశ‌మైన నేపాల్ చాలా విష‌యాల్లో భార‌త్‌పై ఆధార‌ప‌డేది. అయితే, ఇప్పుడు క్ర‌మంగా చైనా వైపు మొగ్గుతున్న నేపాల్ త‌ర‌చూ భార‌త్‌ పై నింద‌లు మోపుతోంది. స‌రిహ‌ద్దు పేచీ పెడుతోంది. సరిహద్దుల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు భారత్ పై నేపాల్ అసత్యమైన విమర్శలు చేస్తోంది. 

రెండు రోజుల క్రితం భారత భూభాగంలోని లిఫులేఖ్,కాలాపానీ,లింపియాధురాని తమ భూభాగంలోనివిగా చూపెడుతూ వివాదాస్పద మ్యాప్ ను నేపాల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడితోనే ఆగకుండా కరోనా విషయంలో కూడా భారత్ పై నేపాల్ తీవ్ర ఆరోపణలు చేసింది. నేపాల్ లో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపించడానికి భారత దేశమే కారణమని… ఇండియా నుంచి వచ్చే వైరస్‌ చైనా, ఇటలీ కంటే డేంజరని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆరోపించారు. అయితే అసలు భారత్ పై నేపాల్ ఉన్నపలంగా ఈ స్థాయిలో తగువుబెట్టుకోవడం వెనుక ఖచ్చితంగా చైనా ఉన్నట్లు సృష్టంగా తెలుస్తోంది. డ్రాగం దేశమే నేపాల్ ని భారత్ పై ఎగదోస్తోందనడం ఎలాంటి సందేహం అవసరం లేదు. 

నేపాల్ లో రాజకీయ సంక్షోభం..పరిష్కరించిన చైనా

నేపాల్ లో ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ(NCP)అధికారంలో ఉంది. కేపీ శర్మ ఓలి ప్రధానిగా ఉన్నారు. అయితే మే నెల ప్రారంభంలో నేపాల్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకులే ప్రధాని ఓలిని రాజీనామా చేయాలంటూ బహిరంగంగా డిమాండ్ చేశారు. ఆ సమయంలో నేపాల్ లో రాజకీయ గందరగోళం తారాస్థాయిలో ఉంది. పార్టీ చైర్మన్ మరియు ప్రెసిడెంట్ రెండు పదవులను స్వాధీనం చేసుకోవడానికి ఓలి…UML(Communist Party of Nepal,Unified Marxist–Leninist))మరియు MC(Communist Party of Nepal,Maoist Centre) విలీన ప్రక్రియను మార్చారు. ప్రతిఒక్కరికీ ఒక వ్యక్తికి ఒక పోస్ట్(one man one post) సూత్రాన్ని వర్తింపజేస్తున్నప్పుడు, ఒలి దానిని స్వయంగా అనుసరించడానికి నిరాకరించాడు. దీంతో ఇది ఇతర నాయకుల వ్యతిరేకతకు దారితీసింది. అప్పుడు తన ప్రభుత్వాన్ని కాపాడాలంటూ నేపాల్ ప్రధాని ఓలి చైనాతో సంప్రదింపులు జరిపారు.

దీంతో నేపాల్ లో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(NCP)నాయకులతో చైనా అంబాసిడర్ హువో యాంకీ వరుస సమావేశాలు నిర్వహించింది సొంతపార్టీ నుంచి ప్రధానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సమస్యను చక్కదిద్దింది. దీంతో ప్రధాని ఓలి ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇదే సమయంలో చేసిన సహాయానికి ప్రతిఫలంగా నేపాల్ ను చైనా అంబాసిడర్ ఓ కోరిక కోరింది. చైనా టార్గెట్ గా జరుగుతున్న అంతర్జాతీయ ఉద్యమానికి వ్యతిరేకంగా నేపాల్ మద్దతును ఆమె కోరింది. చైనా చేసిన సహాయానికి ప్రతిఫలంగానే ఇప్పుడు నేపాల్… భారత్ తో సరిహద్దు పేచీ పెట్టుకుంది. అంతేకాకుండా ఓలి తన సన్నిహితుడిని అధ్యక్షుడిగా కూడా చేశాడు. తన నేతృత్వంలోని పార్టీ నాయకత్వానికి మాధవ్ నేపాల్ మరియు ప్రచండల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు, ఓలీ సహాయం కోసం చైనా రాయబారిని సంప్రదించారు. అప్పుడు చైనా రాయబారి మాధవ్ నేపాల్ మరియు ప్రచండపై ఒత్తిడి తెచ్చి ఓలిని రక్షించారు.

చైనా సహాయానికి ప్రతిఫలంగా భారత్ తో  ఘర్షణ

ఇప్పుడు ఓలీ తనకు సహాయం చేసిన చైనాకు ప్రతిఫలంగా భారత్ కు గొడవకు దిగుతూ చైనా పాట పాడుతున్నాడు. నేపాల్ ప్రధాని ఓలి.. ప్రస్తుత పరిణామాలన్నింటి వెనుక ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన తన సీటుని కాపాడుకోవడం కోసం చైనాతో ఒప్పందంలో బాగంగా భారత్ పై సరిహద్దు గొడవలు,అర్థం లేని ఆరోపణలు చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌లోని రెండు అతిపెద్ద కమ్యూనిస్ట్ పార్టీల యొక్క పెద్ద కూటమిని చైనా రూపొందించిందని కూడా నమ్ముతారు. 2018 లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడానికి కేపీ శర్మ ఒలి మరియు పుష్ప కమల్ దహల్(ప్రచండా) చేతులు కలిపారు. నేపాల్ రాజకీయాలను ఇప్పుడు చైనా ప్రభావితం చేస్తోంది.

సరిహద్దు గొడవ ఏంటీ

మాన‌స స‌రోవ‌ర్ వెళ్లే యాత్రికుల సౌక‌ర్యార్థం ఉత్త‌రాఖండ్‌లోని నేపాల్ త‌మ‌దిగా చెప్పుకుంటున్న లిపులేఖ్ ప్రాంతంలో భార‌త్ ర‌హ‌దారిని నిర్మించింది. ఈ ర‌హ‌దారిని ఈ నెల 8న  భారత ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ స‌మ‌యంలో భార‌త్‌పై నేపాల్ నిర‌స‌న తెలిపిందే. త‌మ భూభాగానికి చెందిన ప్రాంతాల్లో రోడ్డు వేయ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. ఆ దేశ రాజ‌ధానిలో కాఠ్‌మాండూలో కొంద‌రు భార‌త్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల‌కు కూడా దిగారు. అయితే, ఇది పూర్తిగా త‌మ భూభాగ‌మేన‌ని, పైగా ఇది కొత్త దారి కాద‌ని, అనేక ఏళ్లుగా యాత్రికులు ఉప‌యోగిస్తున్న దారేన‌ని భార‌త్ వాదిస్తోంది. ఇదే స‌మ‌యంలో భార‌త ఆర్మీ చీఫ్ ఎంఎం న‌ర‌వాణే నేపాల్ ఆరోప‌ణ‌ల వెనుక చైనా ప్ర‌మేయం ఉందేమోన‌ని ప‌రోక్షంగా అనుమానించారు. ఎవ‌రి కోస‌మే నేపాల్ ఈ ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

మ్యాప్ విడుదల చేసిన నేపాల్.. .తీవ్రంగా స్పందించిన భారత్

రెండు రోజుల క్రితం నేపాల్ విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో.. భార‌త్ భూభాగంలోని కాలాపాని, లింపియాధు‌ర‌, లిపులేఖ్ ప్రాంతాలు ఆ దేశ భూభాగాలుగా చూపించింది. ఈ మ్యాప్‌ను నేపాల్ మంత్రిమండ‌లి ఆమోదించింది. ఈ విష‌య‌మై ఆ దేశ పార్ల‌మెంటులో మాట్లాడిన నేపాల్ ప్ర‌ధాన మంత్రి కేపీ శ‌ర్మ ఓలీ… నేపాల్ గ‌త పాల‌కులు ఎవ‌రూ ఈ మూడు ప్రాంతాల గురించి మాట్లాడ‌లేద‌ని…ఇప్పుడు తాము భార‌త్ నుంచి ఈ ప్రాంతాల‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. 

భార‌త్ భూభాగంలోని ప్రాంతాల‌ను నేపాల్ మ్యాప్‌లో చూపించ‌డంపై భార‌త్ కూడా తీవ్రంగా స్పందించింది. భార‌తదేశ సార్వ‌భౌమాధికారాన్ని, ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను గుర్తించి నేపాల్ త‌యారుచేసిన వాస్త‌వ‌విరుద్ధ మ్యాప్‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని భార‌త విదేశాంగ శాఖ స్ప‌ష్టం చేసింది. దౌత్య‌ప‌రంగా చ‌ర్చించేందుకు అవ‌కాశం ఉండేలా నేపాల్ చ‌ర్య‌లు ఉండాల‌ని ఆకాంక్షించింది. మ‌రోవైపు ఈ వ్య‌వ‌హారంలో చైనా కూడా స్పందించింది. భార‌త్ – నేపాల్ దౌత్య‌ప‌రంగా ఈ స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించింది.

వ్యూహాత్మకంగా భారత్ కు కీలకం

1816లో అప్పుడు భార‌త్‌ను పాలించిన బ్రిటీష్ ప్ర‌భుత్వానికి – నేపాల్‌కు మ‌ధ్య జ‌రిగిన సుగౌలి ఒప్పందం ప్ర‌కారం ఈ మూడు ప్రాంతాలు నేపాల్‌వేన‌ని ఆ దేశం అంటోంది. చాలా రోజులుగానే ఈ వాద‌న‌లు చేస్తున్నా గ‌త అక్టోబ‌రులో నేపాల్‌లో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ప‌ర్య‌టించిన త‌ర్వాత‌నే భార‌త్ – నేపాల్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం మొద‌లైంది. దీంతో చైనానే నేపాల్‌ను పావుగా వాడుకుంటూ భార‌త్‌పై విమ‌ర్శ‌లు చేయిస్తుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాగా, వ్యూహాత్మ‌కంగా ఈ ప్రాంతాలు భార‌త్‌కు చాలా కీల‌కం. 1962 చైనాతో యుద్ధ జ‌రిగిన నాటి నుంచి భార‌త్ ఈ ప్రాంతాల్లో సైనిక స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసి స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. మ‌రీ ముఖ్యంగా కాలాపానీలో ఉండే ప‌ర్వ‌త‌శ్రేణులు భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త‌కు కీల‌కం. ఇక్క‌డ‌కు అతి స‌మీపంలో చైనాకు చెందిన బురాంగ్ సైనిక స్థావ‌రం ఉంది. కాలాపానీ మ‌న ఆధీనంలో లేక‌పోతే భార‌త్‌లోకి ఇక్క‌డి నుంచి చైనా ప్ర‌వేశించ‌డానికి అవకాశం ఉంటుంది. అందుకే భార‌త్ కూడా ఈ ప్రాంతాన్నీ కీల‌కంగా తీసుకుంది.