Citizenship Act : సౌత్ ఈస్ట్ ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిరసన సెగలు దహించి వేస్తున్నాయి. ఆందోళనలకు కేరాఫ్‌గా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నిలిచింది. బస్సులు, బైక్‌లకు విద్యార్ధులు, ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆందోళనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
మరోవైపు హింసాత్మక ఆందోళన కారణంగా ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లో గేట్లను మూసేశారు. సుఖ్ దేవ్ విహార్ స్టేఫన్, జామియా ఇస్లామియా, ఓక్లా విహార్, జసోలా విహార్, ఆశ్రమ్ స్టేషన్ లో రైళ్ల హాల్టింగ్ ను రద్దు చేశారు. విధ్వంస ఘటనల నేపథ్యంలో 2019 డిసెంబర్ 16వ తేదీ సోమవారం సౌత్ ఈస్ట్ ఢిల్లీ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, విధ్వంసానికి పాల్పడవద్దని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.
విధ్వంసానికి దిగిన నిందితులను పట్టుకుని శిక్షిస్తామని అన్నారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కూడా పరిస్థితిని నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. మరోవైపు కాల్పులు జరపారంటూ వస్తున్న వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. విద్యార్థులపై తాము ఎలాంటి కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేసి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
Read More : పౌరసత్వ చట్టం ఢిల్లీ రణరంగం : జనవరి 05 వరకు జామియా యూనివర్శిటీ మూసివేత