దేశం తగలబడిపోతుంటే మోడీ-షా లకు పట్టటం లేదు : సోనియా గాంధీ

పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు ఇష్టమొచ్చినట్టుగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో శనివారం, డిసెంబర్ 14న కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బచావో ర్యాలీలో సోనియా మాట్లాడుతూ..తమకు కావాల్సిన చోట రాజ్యాంగ అధికరణలను విధిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ రాష్ట్రాల హోదాలను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని ఆమె అన్నారు. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయిందని విమర్శించారు. ‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు.
ఏది అడిగినా మంచికాలం గురించి చెపుతారు : చిదంబరం
ఆరు నెలల నరేంద్ర మోడీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ఇప్పటికీ మంత్రులకు దీనిపై సరైన అవగాహన లేదని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న కూడా పార్లమెంట్‌లో మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని.. ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో మనం అగ్రభాగాన ఉన్నామని చెప్పారు. ఎవరు ఏది అడిగినా మంచి కాలం రాబోతుందనే ఆమె సమాధానం చెబుతారని చిదంబరం ఎద్దేవా చేశారు.