పొరపాటున కాంగ్రెస్ కు ఓటేసినా కూడా పాపమే

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2019 / 03:57 PM IST
పొరపాటున కాంగ్రెస్ కు ఓటేసినా కూడా పాపమే

Updated On : April 17, 2019 / 3:57 PM IST

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ మరోసారి నిప్పులు చెరిగారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-17,2019) గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఎవరైనా పాకిస్థాన్ ను తిడితే…భారత్ ను తాను రెండు రెట్లు ఎక్కువగా తిడతానని కాశ్మీర్ లో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడని,అలాంటి వ్యక్తులకు కాంగ్రెస్ అండగా ఉందని,అలాంటి వ్యక్తులకు ఓటు వేసి గుజరాత్ ప్రజలు తప్పు చేస్తారా అని మోడీ ప్రశ్నించారు.

జాతీయవాదులకు మద్దతివ్వాలా, జాతివ్యతిరేకులకు ఓట్లేయాలా అనేది తేల్చుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.సాయుధ బలగాల ప్రత్యేక అధికారం చట్టాన్ని (ఎఫ్‌ స్పా) సమీక్షిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం చేసిందన్నారు. మన సైనికుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేయాలని కాంగ్రెస్ అనుకుంటోదన్నారు.

ఓటర్లు పొరపాటున కాంగ్రెస్ బటన్ నొక్కినా అది పాపమై చుట్టుకుంటుందని, దేశాన్ని సర్వనాశం చేయడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరని విమర్శించారు. 2004 నుంచి 2014 వరకూ కేంద్రంలో రిమోట్ కంట్రోల్ పాలన ఉండేదని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా గుజరాత్‌ కు అన్యాయం జరుగుతూనే వచ్చిందన్నారు.

తప్పుడు కారణాలతో అనేక మంది పోలీసు అధికారులను జైలుకు పంపారని, చివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాను కూడా జైలుకి పంపారన్నారు.2014లో పెద్ద మెజారిటీతో తనను ఎన్నుకున్న ప్రజలు మరోసారి గెలిపించాలని మోడీ కోరారు. అభివృద్ధి మంత్రానికే ప్రజలు పట్టం కట్టాలన్నారు. గుజరాత్‌ లోని 26 లోక్‌సభ స్థానాలకు మూడో ఫేజ్ లో భాగంగా ఏప్రిల్-23న ఒకే విడతలో పోలింగ్ జరుగనుంది.