Congress vs BJP: కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు.. బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరో ఇంకా తెలియదు

రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు

Congress vs BJP: కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు.. బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరో ఇంకా తెలియదు

తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్, మిజోరాం రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. మిజోరాం మినహా నాలుగు రాష్ట్రాల ఫలితాలు ఓకే రోజు వచ్చాయి. ఒక్క తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అయితే జాతీయ పార్టీల్లో ఎప్పుడూ ఉండే విధంగానే నాలుగు రాష్ట్రాల్లో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై చర్చ ప్రారంభమైంది. కాగా, ఈ విషయంలో ఎప్పుడూ ఆలస్యం చేసే కాంగ్రెస్ పార్టీ.. ఈసారి దూకుడుగా ముందుకు వెళ్లింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ప్రకటించింది. అంతే కాదు, ఆయన గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ, భారతీయ జనతా పార్టీ ఆ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్ని ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం.

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి గత 18 ఏళ్లుగా శివరాజ్ సింగే ముఖ్యమంత్రి. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. మళ్లీ శివరాజ్ కు అవకాశం ఇస్తారో లేదో కూడా తెలియదు. అలాగే ఛత్తీస్‭గఢ్ రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. రాష్ట్రం ఏర్పాటు అయనప్పటి నుంచి రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరుసగా 15 ఏళ్లు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆయన రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయం సాధించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనేది సస్పెన్స్ లోనే ఉంది. వీరిద్దరూ కాకుండా ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఊహించడం కూడా కొంత కష్టంగానే ఉంది. అయితే అధిష్టానం ఎవరినైనా నిర్ణయించొచ్చనే ఊహాగాణాలు కూడా ఉన్నాయి.

ఇక రాజస్థాన్ పరిస్థితి విచిత్రంగా ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువే అయినప్పటికీ రాష్ట్రంలో బలమైన నేతగా మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఉన్నారు. అయితే ఎన్నికల ముందు ఆమెకు ప్రాధాన్యత ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయని చర్చ జరిగింది. పార్టీ టికెట్ల జారీలో కూడా అదే కనిపించింది. బయటికి ఆమె కొంత మౌనంగానే ఉన్నప్పటికీ.. తెర వెనుక రాజకీయం నడిపించినట్టు తెలుస్తోంది. అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రిని కూడా ఇంకా నిర్ణయించలేదు. అయితే కేంద్రమంత్రి అర్జున్ రాం మేఘవాల్, ఎమ్మెల్యే దియా కుమారి, బాబా బాలక్ నాథ్ వంటి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈసారి పూర్తిగా కొత్త ముఖాలనే సీఎంలుగా నియమించాలని బీజేపీ అధిష్టానం భావిస్తు్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.