Pawan Khera takes jibe at Narendra Modi : ప్రధాని మోడీ సినిమాల్లో నటిస్తే మేలన్న కాంగ్రెస్
కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది.

Pawan Khera Takes Jibe At Narendra Modi
Pawan Khera కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. ప్రధాని మోడీ సినిమాల్లో నటించాల్సిందని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. గుజరాత్ లో మోడీ సీఎంగా ఉన్నప్పటి రోజులనుంచి ఆయన గురించి తెలిసిన వారు మోడీ రాజకీయాల్లో లేకుంటే సినిమాల్లో ఉండేవారని చెబుతుంటారని,మోడీ సినిమాల్లో ఉంటే సినిమాలకు లాభం వచ్చేదని, రాజకీయాల్లో ఉండటంతో దేశానికి నష్టం వాటిల్లిందని పవన్ ఖేరా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మరోవైపు, ప్రధాని మోడీ ఇలాంటి నాటకాలను కట్టిపెట్టాలని ఆర్జేడీ వ్యాఖ్యానించింది. గంగానది ఉక్కిరిబిక్కిరి అయిందని, ఆస్పత్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని, శ్మశానవాటికలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని, లక్షలాది మంది తోటి భారతీయులను కోల్పోయిన వ్యక్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని మీకు తెలియదా?అని ఆర్జేడీ ప్రధానిని ప్రశ్నించింది. మొసలి కన్నీళ్లు కార్చడం ద్వారా ఆయనకి సానుభూతి లభించదని ఆర్జేడీ పేర్కొంది. కరోనా మహమ్మారితో ప్రజలు చనిపోతున్నప్పుడు ప్రధాని ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉన్నారని ఆర్జేడీ విమర్శించింది.
కాగా, శుక్రవారం ప్రధాని మోడీ.. తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఉన్నట్టుండి భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారికి మనవాళ్లు ఎంతో మంది బలయ్యారని ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కరోనా బలి తీసుకుంటుదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు.