వర్క్ ఫ్రం హోంను ప్రోత్సహించాలి…జనతా కర్ఫ్యూలో పాల్గొనండి : కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీలోని అందరూ టోల్ ఫ్రీ నెంబర్ 1075కి ఫోన్ చేసి అన్ని రకాల మిస్ ఇన్ఫర్మేషన్ ను క్లియర్ చేసుకోవాలని అగర్వాల్ విజ్ణప్తి చేశారు.
కరోనా విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన సూచనలు,సలహాలు పాటించాలన్నారు. ప్రధాని మోడీ ఇదే విషయమై అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్నారని తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్ అనేది ఇప్పుడు తమ తక్షణ గుర్తించబడిన ప్రొటొకాల్ అని అగర్వాల్ తెలిపారు. కేసు గుర్తించిన వెంటనే ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
ప్రధాని మోడీ చెప్పినట్లుగా ఆదివారం ప్రజలందరూ జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. ఇళ్లు,పరిసరాలను అందరూ శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజా రవాణాను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైద్యులు,అత్యవసర సేవల్లో పనిచేసేవారిని ప్రోత్సహించాలన్నారు.
భారత్ లో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 223కి చేరింది. ఐదుగరు కరోనా సోకి మరణించారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య10వేలు దాటింది. అయితే ఈ వైరస్ సోకిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 50 వేలకు చేరుకుంటోంది. అయితే కరోనా మరణాలు వైరస్ మొదట పుట్టిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా నమోదయ్యాయి.