ఇండియాలో కరోనా @ 258 కేసులు

  • Published By: madhu ,Published On : March 21, 2020 / 04:08 AM IST
ఇండియాలో కరోనా @ 258 కేసులు

Updated On : March 21, 2020 / 4:08 AM IST

దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో 55 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 
పాజిటివ్‌ కేసుల సంఖ్య 258కి చేరింది. మహారాష్ట్రలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 52కు చేరింది. పశ్చిమ బెంగాల్‌లో రెండో పాజిటివ్‌ కేసు నమోదైంది.

యూకేలో చదువుతున్న 22 ఏళ్ల యువకుడు.. మార్చి 13న కోల్‌కతాకు వచ్చిన తర్వాత అతడికి వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించారు. వచ్చినరోజు నుంచీ మార్చి 19 దాకా.. అతడు జనసమ్మర్ద ప్రదేశాలకు వెళ్లాడని తెలిపారు. అతణ్ని, అతడి కుటుంబ సభ్యులను, స్నేహితులను క్వారంటైన్‌లో ఉంచినట్టు తెలిపారు. లద్దాఖ్‌లో కొత్తగా రెండు పాజిటివ్‌ కేసుల నమోదుతో బాధితుల సంఖ్య పదికి పెరిగింది.

See Also | సింగర్ కనికా ఎఫెక్ట్, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కరోనా పరీక్షలు..?

గుజరాత్‌లో మూడు కొత్త కేసులు నమోదు కాగా.. బాధితుల సంఖ్య ఐదుకు పెరిగింది. దేశవ్యాప్తంగా.. వైరస్‌ బారిన పడిన వారితో సన్నిహితంగా మెలిగిన 6700 మందిపై నిఘా పెట్టినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిత్యావసర వస్తువులకు ఎటువంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రజలను కోరింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్ భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణలోనూ కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగుతోంది. నిన్న ఒక్క రోజే ముగ్గురికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య  ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం తెలంగాణలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి.

తిరుమల, తిరుపతి, ఇతర దర్శనీయ ప్రదేశాలన్నీ యాత్రికులు లేక బోసిపోయాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు వైద్య నిపుణులు  సూచించిన అన్ని ముందు జాగ్రత్త చర్యలను పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు తమ నివాసాలలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను విరమించుకోవాలని సూచించారు.