1000దాటిన కరోనా మరణాలు…వేగంగా స్పందించడం వల్లే 130కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా కంట్రోల్

  • Published By: venkaiahnaidu ,Published On : April 29, 2020 / 05:46 AM IST
1000దాటిన కరోనా మరణాలు…వేగంగా స్పందించడం వల్లే 130కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా కంట్రోల్

Updated On : April 29, 2020 / 5:46 AM IST

భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో మరణాల సంఖ్య రెట్టింపు అవడంతో పాటు కేసుల సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది. వైరస్ మహమ్మారి వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టినా.. పాజిటివ్ కేసులు మాత్రం రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 31,411కి చేరుకుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,890 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సరైన సమయంలో స్పందించి లాక్ డౌన్ విధించడం వల్లే 130కోట్లమంది జనాభా ఉన్న దేశంలో కేవలం 1000మరణాలు,30వేల కేసులు మాత్రమే నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోవడంతోనే భారత్ లో కరోనా కంట్రోల్ అయిందని అంటున్నారు. కరోనా టెస్ట్ ల్లో దక్షిణకొరియా రికార్డ్ ను దాటామని,దక్షిణకొరియా కంటే ఎక్కువమందికి భారత్ కరోనా టెస్ట్ లు చేసినట్లు రెండు రోజుల క్రితం కేంద్రఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా,,దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 9,289 మందికి వైరస్ సోకింది. మరణాలు సంఖ్య 400కి చేరింది. ఒక్క ముంబయిలోనే 244 మంది మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే మహారాష్ట్రలో అత్యధికంగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారవీలో మంగళవారం మరో 45 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. ఐదుగురు మరణించారు. దీంతో అక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 335గా నమోదయ్యింది. ముంబై తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోనే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు ఢిల్లీలోని సీఆర్ఫీఎఫ్ బెటాలియన్ లో 47 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఓ జవాన్ కరోనా సోకి మరణించాడు. ఈ బెటాలియన్ లో ఉన్న దాదాపు 1000మందిని క్వారంటైన్ చేశారు. 

ఇక, ఏపీలోనూ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. ఇప్పుటివరకు ఏపీలో 1332 కరోనా కేసులు నమోదవగా, 31మరణాలు సంభవించాయి. 287మంది డిశ్చార్జ్ అయ్యారు. 1014యాక్టివ్ కేసులున్నాయి. అయితే, పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించడంతోనే కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు చేయని జిల్లాగా విజయనగరం నిలిచింది. తెలంగాణలో మాత్రం కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఆరు రోజులగా సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదుకావడం సానుకూలంశం. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 50శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనివే. తెలంగాణలో 1009కి కరోనా కేసులు చేరాయి. 374మంది డిశ్చార్జ్ అయ్యారు. 610యాక్టివ్ కేసులున్నాయి. కాగా, ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 7,700 మంది కోలుకోవడం శుభపరిణామం.