ఉప ఎన్నికల ముందు…యోగి సర్కార్ కు బిగ్ షాక్

యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర్-16,2019) స్టే ఇచ్చింది.
ఈ ఏడాది జూన్ లో కశ్యప్,గౌడియా,నిషాద్, బింద్, మల్లాహ్, కేవట్, భర్, థివర్, మచువా, ప్రజాపతి, రాజ్‌భర్, మాంఝి,కుమ్హార్ సహా 17 ఇతర వెనుకబడిన కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేరుస్తూ యోగి సర్కార్ ఆదేశాలిచ్చింది. యూపీలో 17 ఓబీసీ వర్గాలకు ఎస్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలన్న నిర్ణయాన్ని కేంద్ర సైతం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని తెలిపింది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓబీసీ వర్గాలను ఆకట్టుకునేందుకు యోగి ఈ ఆదేశాలిచ్చారంటూ విమర్శలూ వెల్లువెత్తాయి. ఇది పెద్ద మోసపూరిత చర్యగా బీఎస్పీ అధినేత్రి మాయావతి అభివర్ణించిన విషయం తెలిసిందే.
అయితే 2005 లో కూడా ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్న సమయంలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం 11 కులాలను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని ఒక ఉత్తర్వు జారీ చేసింది, కాని ఆ ఉత్తర్వుపై స్టే ఆర్డర్ రావడం, ఆ ప్రతిపాదన కేంద్రానికి పంపడంతో ములాయం ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మాయావతి నేతృత్వంలోని బిఎస్పి ప్రభుత్వం ఆ విధమైన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది, ఎక్కువ కులాలను చేర్చే ముందు షెడ్యూల్డ్ కులాల కోటాను పెంచాలని ఆమె తెలిపింది.