Cyclone Yaas : ముంచుకొస్తున్న యాస్ తుఫాన్…సన్నద్ధతపై ప్రధాని సమీక్ష

తౌటే తుఫాను విలయం నుంచి కోలుకోక ముందే "యాస్‌" రూపంలో మరోముప్పు ముంచుకొస్తోంది.

Cyclone Yaas : ముంచుకొస్తున్న యాస్ తుఫాన్…సన్నద్ధతపై ప్రధాని సమీక్ష

Cyclone Yaas Pm Modi Holds Meeting To Review Preparedness

Updated On : May 23, 2021 / 4:48 PM IST

Cyclone Yaas తౌటే తుఫాను విలయం నుంచి కోలుకోక ముందే “యాస్‌” రూపంలో మరోముప్పు ముంచుకొస్తోంది. తాజాగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 24న తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26న సాయంత్రం ఒడిశా-బెంగాల్‌ మధ్య తీరాన్ని తాకవచ్చని తెలిపింది. ఈ తుఫాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌పై అధికంగా ఉండవచ్చని అంచనా వేసింది. తుఫాను ముందస్తు హెచ్చరికలతో అటు ఈశాన్య రైల్వే కూడా పలు సర్వీసులను రద్దుచేసింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌, పూరీల మధ్య నడిచే రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

యాస్‌ తుఫానుపై వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సన్నద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆదివారం ప్రధాని మోడీ వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో పాటు టెలికాం, విద్యుత్‌, పౌరవిమానయాన శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. అధికారులకు పలు సూచనలు చేశారు. తుఫాను సమయంలో ముప్పు ప్రాంతాల ప్రజలతోపాటు ఇప్పటికే కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సకాలంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, వారికి భరోసా, ధైర్యాన్ని కల్పించాలని సూచించారు. వీటితో పాటు విద్యుత్ అంతరాయాలను తొలగించి, సకాలంలో స్పందించాలని కోరారు. అలాగే సముద్రపు ఒడ్డున ఉంటూ రోజు వారి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

యాస్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు భారత సైన్యం కూడా సిద్ధమైంది. సహాయ సహకారాలతో పాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి గాను ఇప్పటికే 46ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉండగా.. మరో 13 బృందాలు చేరుకోనున్నాయి. ఇక ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో భారత వాయుసేన సిద్ధంగా ఉంది.