షాకు ఓవైసీ కౌంటర్ : సీఏఏపై రాహుల్,మమత ఎందుకు…గడ్డం ఉన్న నాతో డిబేట్ చెయ్యండి

సీఏఏ,ఎన్ఆర్సీలపై తనతో డిబేట్ కు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ లకు మంగళవారం అమిత్ షా సవాల్ విసిరిన విషయం తెలిసిందే. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏపై కాంగ్రెస్,ఎస్పీ,తృణముల్ పార్టీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని షా ఆరోపించారు.
సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవాళ్లు తమ ఆందోళనలు కంటిన్యూ చేసుకోవచ్చని…ప్రభుత్వం మాత్రం ఈ చట్టం ఉపసంహరించుకోదని హోంమంత్రి అన్నారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. రాహుల్,మమతలతో ఎందుకు డిబేట్ చేయడం…దమ్ముంటే గడ్డం (అసదుద్దీన్)వాడితో డిబేట్ చేయాలని ఓవైసీ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ…వారితో ఎందుకు చర్చించాలి? కావాలంటే నాతో చర్చించండి. వారితో చర్చిస్తే ఏం వస్తుంది. ఇప్పుడు చర్చ జరగాల్సింది గడ్డం ఉన్న ముస్లిం వ్యక్తితో కదా అని ఒవైసీ విమర్శలు గుప్పించారు. అదే విధంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్ ముస్లింలపై వివక్ష చూపుతున్నాయని ఓవైసీ ఆరోపించారు.