అట్లుంటది మోదీతోని.. పాక్‌ను ఎలా ఏమార్చారు? ఊహకు అందని రీతిలో.. చెప్పింది చెప్పినట్లుగానే..

మోదీ వ్యూహం ముందు పాక్‌ చిన్నబోయింది. భారత్‌ అంత పెద్ద ఎత్తున ఏకంగా తొమ్మిది ప్రదేశాల్లో దాడులు చేసినప్పటికీ పాక్‌ ఏమీ చేయలేకపోయింది.

అట్లుంటది మోదీతోని.. పాక్‌ను ఎలా ఏమార్చారు? ఊహకు అందని రీతిలో.. చెప్పింది చెప్పినట్లుగానే..

Modi

Updated On : May 7, 2025 / 6:01 PM IST

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటల్లోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెబుతామని ప్రకటించారు. 26 మందిని దారుణంగా చంపిన ఉగ్రవాదుల చర్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకింది.

పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌పై అనేక రకాలుగా దౌత్య పరంగా మోదీ చర్యలు తీసుకుంటున్నారు. పాకిస్థాన్‌పై దాడులు చేయడమే కాదు.. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు ఇతర మార్గాలూ ఉన్నాయని నిరూపించారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత, అంతర్జాతీయంగా పాక్‌ను ఎండగట్టడం వంటివి చేశారు.

పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి పాక్ ఉగ్రవాదులకు గట్టిగా సమాధానం ఇస్తామని భారత్‌ చెబుతూనే ఉంది. భారత్‌ చేయబోయే దాడిని తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో పాకిస్థాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయినప్పటికీ, మోదీ వ్యూహం ముందు పాక్‌ చిన్నబోయింది. భారత్‌ అంత పెద్ద ఎత్తున ఏకంగా తొమ్మిది ప్రదేశాల్లో దాడులు చేసినప్పటికీ పాక్‌ ఏమీ చేయలేకపోయింది.

భారత్ వ్యూహాన్ని పాక్‌ ఏ మాత్రం పసిగట్టలేకపోయింది. ఏం జరుగుతుందో కూడా ఊహించలేకపోయింది. భారత్‌ వ్యూహం రచిస్తే ఎలా ఉంటుందో మరోసారి నిరూపించారు మోదీ. పాక్‌ భూభాగంపై దాడులు జరపడానికి భారత్‌ ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ సాధారణంగా పాక్ దృష్టి అంతా మోదీపైనే ఉంటుంది. ఆ సమయంలో మోదీ ఏమేం చేశారు?

Also Read: ఎప్పుడైనా, ఏ విధంగానైనా ప్రతిస్పందిస్తాం.. పాక్‌ ఆర్మీకి ఆ దేశ సర్కారు అనుమతి.. ఏం జరగనుంది?

దాడులకు ముందు రోజుల్లో మోదీ ఇలా..

దాడులకు ముందు మోదీ సాధారణ రీతిలోనే దేశంలో తన పర్యటనలు కొనసాగించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ముంబైలో.. మే 1న ప్రధాని మోదీ ప్రపంచ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025కి హాజరయ్యారు.

తిరువనంతపురంలో.. మే 2న ప్రధాని మోదీ రూ.8,800 కోట్ల విలువైన విజింజం అంతర్జాతీయ డీప్‌వాటర్ బహుళార్ధసాధక నౌకాశ్రయాన్ని జాతికి అంకితం చేశారు.

మాక్ డ్రిల్స్: రెండు రోజుల ముందు కేంద్ర హోం శాఖ దేశంలోని రాష్ట్రాలకు ఓ సూచన చేసింది. మే 7న దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని మే 5న ఆదేశించింది. అన్ని ప్రభుత్వ సోషల్ మీడియా హ్యాండిల్స్ దీని గురించి పోస్ట్ చేశాయి. దీంతో ఈ డ్రిల్స్‌ తర్వాత కొన్ని రోజులకు పాక్‌పై భారత్ దాడి చేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

భారత్-యూకే ఎఫ్‌టీఏ: భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ మే 6న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటించాయి. ఈ ప్రకటనలను ఇరు దేశాల ప్రధాన మంత్రులు చేశారు.

మీడియా సమ్మిట్: మే 6న జరిగిన ఓ టీవీ న్యూస్ ఛానల్ సదస్సులో మోదీ ప్రసంగించారు.

తదుపరి పర్యటనకు సన్నాహాలు: ప్రధాని మోదీ తదుపరి పర్యటనకు విదేశాంగ శాఖ సన్నాహాలు చేస్తూనే ఉంది. జర్నలిస్టులను, విదేశీ ప్రముఖులను లంచ్, విందులకు ఆహ్వానిస్తూనే ఉంది.

రాజస్థాన్‌లో విన్యాసాలు: పాకిస్థాన్‌తో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి రాజస్థాన్‌లో భారత వైమానిక దళం 2 రోజుల మెగా సైనిక విన్యాసాలను మే 7 నుంచి చేస్తుందని ప్రకటన వచ్చింది. రాఫెల్, సుఖోయ్-30, జాగ్వార్ విమానాలు సహా అన్ని ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్‌లను ఇందులో వాడుతున్నట్లు భారత సర్కారు తెలిపింది.

వ్యూహాత్మకంగా మౌనాన్ని పాటించిన విదేశాంగ శాఖ: పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత విదేశాంగ శాఖ, రక్షణ దళాలు మౌనాన్ని పాటించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ క్లోజ్డ్ డోర్ బ్రీఫింగ్‌కు సైంతం విదేశాంగ శాఖ స్పందించలేదు.

ప్రతిస్పందన: పహల్గాం దాడి గురించి మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ బహిరంగంగానే మాట్లాడారు. పహల్గాం దాడి అంశాన్ని డిప్యూటీ రాయబారి యోజన పటేల్ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు.