ఢిల్లీ అల్లర్ల కేసు : సహ కుట్రదారులుగా చార్జిషీట్‌లో ఏచూరి సహా ప్రముఖుల పేర్లు

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. . ఈ సందర్భంగా జరిగిన హింసలో 53 మంది మరణించగా, 200మందికిపైగా గాయపడ్డారు. కాగా,ఇప్పుడు ఈ కేసులో సహ కుట్రదారులుగా పలువురు ప్రముఖులును చార్జిషీట్ లో ఢిల్లీ పోలీసులు చేర్చడం సంచలనం రేపింది.
సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్,ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్,స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్,డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్ పేర్లను సప్లిమెంటరీ చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు శనివారం చేర్చారు. జాఫ్రాబాద్ ఘర్షణలో జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చారు.
వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది.
ఢిల్లీలో అల్లర్లు రేపేందుకు కొందరు కుట్ర పన్నారని ఫాతిమా తెలిపారనీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని తనతో చెప్పారని ఫాతిమా అంగీకరించారని తెలిపింది. ఇందులో ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ అపూర్వానంద్ పాత్ర ఉందని, ఆయనే అల్లర్లకు పథకం రూపొందించారన్న ఫాతిమా మాటలను ఉటంకిస్తూ ఢిల్లీ పోలీసులు చార్జిషీట్ పొందుపర్చారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరో రెండు రోజుల్లో (సెప్టెంబరు,14న) ప్రారంభం కానున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం