Delhi Unlock: ఢిల్లీలో ప్రారంభమైన అన్‌లాక్ ప్రక్రియ

Delhi Unlock: ఢిల్లీలో ప్రారంభమైన అన్‌లాక్ ప్రక్రియ

Delhi Unlock Process Started

Updated On : June 7, 2021 / 12:48 PM IST

Delhi Unlock: ఢిల్లీలో కరోనా కేసుల నమోదు తగ్గడంతో అన్‌లాక్ ప్రక్రియ షురూ అయింది. రోజుకు 40వేలకు పైగా నమోదైన స్థాయి నుంచి 400 కంటే తక్కువ కేసులతో కొనసాగుతూ ఉంది దేశ రాజధాని. ఈ మేరకు నిబంధనలు సడలించే పనిలో పడింది. దుకాణాలు, మాల్స్, మార్కెట్ కాంప్లెక్సులు ఓపెన్ చేయాలని నిర్ణయించారు.

ప్రత్యామ్నాయ పద్ధతిలో ఓపెన్ చేయాలని సరి, బేసి విధానాలను అమల్లోకి తీసుకొచ్చారు. కాకపోతే సమయాల్లో మార్పులు చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతించారు. అత్యవసర వస్తువులు, రెసిడెన్షియల్ ప్రాంతాలు, ఒక దుకాణం మాత్రమే ఉండే చోట అన్ని రోజులు దుకాణాలు తెరుచుకోవచ్చు.

ఓపెన్ చేసి ఉంచే దుకాణాలు, మాల్స్, మార్కెట్ అసోసియేషన్లకు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితో పని చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చింది. కోవిడ్ కారణంగా ఢిల్లీలో మే 10నుంచి మూతపడిన మెట్రో సేవలను పునరుద్ధరిస్తూ 50శాతం ఆక్యుపెన్సీతో ప్రారంభించారు.

62 రోజుల తరువాత ఆదివారం 381 కేసులు మాత్రమే నమోదైయ్యాయి. 34 మంది మృతి చెందారు. అంతేకాకుండా ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5889 మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకూ 14 లక్షల 29వేల 244 కేసులు, 24,591 మంది మృతి చెందారు.