Ozempic Cost in India: ‘వెయిట్ లాస్ డ్రగ్’.. ఇండియాలోకి వచ్చేసిన ఒజెంపిక్.. ఒక్కో డోస్ ధర..

టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో వెయిట్ లాస్‌కు కూడా ఉపయోగపడుతుంది.

Ozempic Cost in India: ‘వెయిట్ లాస్ డ్రగ్’.. ఇండియాలోకి వచ్చేసిన ఒజెంపిక్.. ఒక్కో డోస్ ధర..

Ozempic India

Updated On : December 12, 2025 / 4:28 PM IST

Ozempic India: డెన్మార్క్‌లోని గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నోవో నార్డిస్క్ ఇవాళ ఒజెంపిక్ అనే డయాబెటిస్‌, వెయిట్ లాస్ డ్రగ్‌ను భారత్‌లో విడుదల చేసింది. డయాబెటిస్, హార్మోన్ థెరపీ, ఒబేసిటీ వంటి దీర్ఘకాలిక సమస్యల చికిత్సల కోసం ఔషధాలు తయారు చేసే అంతర్జాతీయ కంపెనే నోవో నార్డిస్క్.

వారానికి ఒక్కసారి ఇంజెక్ట్ చేసే సెమాగ్లూటైడ్ ఫార్ములేషనే ఈ “ఒజెంపిక్”. సెమాగ్లూటైడ్ అంటే రక్తంలో చక్కెర తగ్గించే హార్మోన్ ప్రభావాన్ని అనుకరించే ఔషధం. భారత్‌లో టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో లేని పెద్దలు ఆహారం, వ్యాయామం చేస్తూనే ఈ ఔషధాన్ని వాడేందుకు ఇప్పటికే ఆమోదముద్ర పడింది.

ఈ డ్రగ్ 0.25 ఎంజీ, 0.5 ఎంజీ, 1 ఎంజీ అనే మూడు డోసేజ్‌లలో లభ్యం కానుంది. ఒక్కసారి వాడి పారేసే ప్రీ ఫిల్డ్ పెన్‌లో వస్తుంది. నోవోఫైన్ నీడిల్స్ అనే పెన్ పైనా ఉంటుంది. ఇది సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్. అంటే చర్మపు కింద ఇంజెక్ట్ చేసే విధానంలో దీన్ని తీసుకుంటారు.

ప్రారంభ డోసు 0.25 ఎంజీ ధర రూ.8,800. అలాగే, 0.5 ఎంజీ ధర రూ.10,170, 1 ఎంజీ ధర రూ.11,175. ప్రతి పెన్‌లో నాలుగు వారాలకు సరిపడే డోసులు ఉంటాయి.

Also Read: ఇండియాపై మెక్సికో 50 శాతం టారిఫ్‌ల వల్ల మన దేశంలో అత్యధికంగా దెబ్బతినే రంగం ఇదే..

“ఒజెంపిక్‌ను ఇండియాకు తీసుకురావడం ఓ పెద్ద మైల్‌స్టోన్‌గా భావిస్తున్నాం. అంతర్జాతీయంగా ఉన్న నమ్మకం, క్లినికల్ ప్రూఫ్, వరల్డ్ క్లాస్ క్వాలిటీ, బలమైన సరఫరా వ్యవస్థ ఆధారంగా ఒజెంపిక్ ఇండియన్ డాక్టర్లకు మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది” అని నోవో నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా చెప్పారు.

గుండె, కిడ్నీలకు దీర్ఘకాల రక్షణ
“మా లక్ష్యం పేషెంట్లకు ఇన్నోవేటివ్, సులభంగా అందే థెరపీని అందించడం. ఇది రక్తంలో గ్లైసెమిక్ కంట్రోల్ మెరుగుపరుస్తుంది. వెయిట్ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడుతుంది, హృదయం, కిడ్నీలకు దీర్ఘకాల రక్షణ ఇస్తుంది” అని శ్రోత్రియా తెలిపారు.

ఒజెంపిక్ 2017లో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ద్వారా టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్‌ విషయంలో ఆమోదం పొందింది. ఆకలిని తగ్గించే ప్రభావం కూడా ఇందులో ఉండడం వల్ల వెయిట్ లాస్ కోసం కూడా దీన్ని విస్తృతంగా వాడుతున్నారు. హృదయ సంబంధ , కిడ్నీ సమస్యల నుంచి రక్షణ కూడా ఇస్తుందని నోవో తెలిపింది.

ఈ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఒజెంపిక్ ఒక జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్. అంటే శరీరంలో సహజంగా ఉండే జీఎల్‌పీ-1 హార్మోన్‌లా పనిచేసే ఔషధం. ఇది గ్లైసెమిక్ కంట్రోల్‌ను మెరుగుపరచడంలో, హెచ్‌బీఏ1సీని తగ్గించడంలో సహాయపడుతుంది. హెచ్‌బీఏ1సీ అంటే మనిషి శరీరంలో 3 నెలల బ్లడ్‌ షుగర్‌ సగటును చూపించే ప్రమాణం.

ఆకలి నియంత్రణ కోసం.. మెదడులో ఆకలిని నియంత్రించే ప్రాంతాలపై ఈ ఔషధం పనిచేస్తుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో వెయిట్ లాస్‌కు కూడా ఉపయోగపడుతుంది.