మోడీ పెళ్లిపై దిగ్విజయ్ డౌట్స్

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు ప్రధాని మోడీ ఎప్పుడూ నామినేషన్ పత్రాల్లో తన పెళ్లి గురించి ప్రస్తావించలేదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ చెప్పినదానికి, ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్నదానికి పొంతనే లేదన్నారు.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గరువారం(మార్చి-28,2019) ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నిజం చెప్పేందుకు ప్రధానమంత్రి ఎందుకు భయపడుతున్నారని దిగ్విజయ్ ప్రశ్నించారు.ప్రధానిపై వ్యక్తిగత విమర్శలు చేయడం తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో పోటీచేసినప్పుడల్లా ఆయన తన నామినేషన్ పత్రాల్లో వివాహం గురించి వెల్లడించకపోవడానికి కారణమేంటి అని ప్రశ్నించారు.2014 ఎన్నికల సమయంలో మోడీ తన పెళ్లి గురించి చెప్పారని,2014కి ముందు ఎందుకు ఆయన ఈ విషయం దాచిపెట్టారు? ఆయన విద్యార్హతల గురించి కూడా ఎందుకు చెప్పలేదు? ఏ డిగ్రీ ఉందో చెప్పడానికి కూడా ఇబ్బంది దేనికి… అంటూ దిగ్విజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు.