కలిసి ముందుకు : డీఎంకే-కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు

  • Published By: venkaiahnaidu ,Published On : February 20, 2019 / 03:35 PM IST
కలిసి ముందుకు : డీఎంకే-కాంగ్రెస్ మధ్య కుదిరిన పొత్తు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో పొత్తుల రాజకీయాలు ఊపందుకున్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ-పీఎంకేల  మధ్య పొత్తు కుదిరిన 24గంటల్లోనే కాంగ్రెస్-డీఎంకేల మధ్య పొత్తు ఖరారైంది. కాంగ్రెస్ తో పొత్తుపై బుధవారం(ఫిబ్రవరి-20-2019)డీఎంకే చీఫ్ స్టాలిన్  అధికారిక ప్రకటన చేశారు.

 

తమిళనాడులోని మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 9స్థానాల్లో పోటీ చేస్తుందని స్టాలిన్ తెలిపారు.పుదుచ్చేరి రాష్ట్రంలోని ఒక ఎంపీ సీటు కూడా పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు కేటాయించినట్లు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ ముఖుల్ వాసిక్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీట్ షేరింగ్ కి సంబంధించి డీఎంకే చీఫ్ స్టాలిన్ తో చర్చలు జరిపిన అనంతరం మీడియా సమావేశంలో స్టాలిన్ కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీపై ప్రజలు కోపంతో ఉన్నారని, ప్రతిపక్ష వేవ్ రాష్ట్రంలో ఉందని స్టాలిన్ అన్నారు.మిగతా చిన్న చిన్న భాగస్వామ్య పార్టీలకు 6 స్థానాలు కేటాయించి 20 స్థానాల్లో పోటీకి దిగాలని డీఎంకే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే రాష్ట్రంలోని మొత్తం 39 లోక్ సభ నియోజకవర్గాల్లో 37ఎంపీ సీట్లు గెల్చుకొన్న విషయం తెలిసిందే.  బీజేపీ,పీఎంకేలు చెరొక ఎంపీ సీటుని దక్కించుకున్నాయి. డీఎంకే ,కాంగ్రెస్ మాత్రం ఒక్క ఎంపీ సీటుని కూడా దక్కించుకోలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా అత్యధిక ఎంపీ స్థానాలు గెల్చుకోవాలన్న పట్టుదలతో డీఎంకే ఉంది. ఇందులో భాగంగానే కలిసివచ్చే చిన్న చిన్న పార్టీలతో కూడా  పొత్తుకి సిద్ధమైంది.