Indigo Crisis: ప్రయాణికులకు నరకం చూపించిన ఇండిగోకి డబుల్ షాక్..! ఫ్యూచర్‌లో కష్టమే..!

ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించిన తీరును కూడా ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. వరుస విమానాల రద్దుతో ఇతర కంపెనీలు భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై వెంటనే ఎందుకు స్పందించలేదంటూ నిలదీసింది.

Indigo Crisis: ప్రయాణికులకు నరకం చూపించిన ఇండిగోకి డబుల్ షాక్..! ఫ్యూచర్‌లో కష్టమే..!

Updated On : December 10, 2025 / 9:26 PM IST

Indigo Crisis: పాసింజర్లకు నరకం చూపించిన ఇండిగో కంపెనీకి డబుల్ షాక్ తగిలింది. ఇంత సంక్షోభానికి కారణమైన ఇండిగోపై కఠినమైన చర్యలుంటాయని కేంద్రం చెప్పిన 24 గంటల్లోపే ఆ సంస్థ సర్వీసుల్లో 10శాతం ఆపేసి మొదటి షాక్ ఇచ్చింది. ఇక అసలు విమానయాన రంగంలోనే తాను గుత్తాధిపత్యం వహించేలా ఏదైనా కుట్రకి పాల్పడిందా అనే కోణంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేయనుంది. ఇది రెండో షాక్..! వీటితో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ కేసులో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.

మార్చి వరకు 10శాతం సర్వీసులు కట్..

పాసింజర్లను గత వారం రోజులుగా అష్టకష్టాలు పెట్టిన ఇండిగోపై కేంద్రం చర్యలకు దిగింది. వచ్చే మార్చి నెల వరకూ ఈ సంస్థ నడిపే విమాన సర్వీసుల్లో 10శాతం తగ్గించేయాలని ఆదేశించింది. దీంతో కనీసమంటే కనీసం రోజుకి 200 సర్వీసులు ఇండిగో తగ్గించుకోవాలి. అలా వచ్చే మార్చి వరకూ చూస్తే.. నాలుగు నెలలు ఈ సర్వీసుల కోత అమలు కానుంది..అలానే అసలు విమానయాన రంగంలో మోనోపలీ అంటే.. తన సంస్థే డామినేట్ చేసేలా ఏమైనా వ్యూహం పన్నిందా అనే అంన్ని కూడా దర్యాప్తు సంస్థలు పరిశీలించబోతున్నాయ్. ఈ దిశగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రంగంలోకి దిగనుంది. ఇలా ఇండిగో డబుల్‌ షాక్ ఎదుర్కోనుండగా.. మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా ఇండిగో వ్యవహారంపై మండిపడింది.

అయితే, ఈ వ్యవహారంలో కేంద్రం స్పందించిన తీరును కూడా ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. వరుస విమానాల రద్దుతో ఇతర కంపెనీలు భారీగా ఛార్జీలు వసూలు చేయడంపై వెంటనే ఎందుకు స్పందించలేదంటూ నిలదీసింది. ఒక సంస్థలో సంక్షోభం ఏర్పడితే.. ఇతర విమానయాన సంస్థలు దానిని ప్రయోజనంగా మార్చుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. అసలు ఛార్జీలు రూ.35వేల నుంచి రూ.39వేల వరకు ఎలా పెరిగాయని ప్రశ్నించింది.

ముంబై-ఢిల్లీ మధ్య ఎకానమీ వన్-వే టిక్కెట్ ధర రూ.35వేల వరకు పెరిగింది. సాధారణంగా చివరి నిమిషంలో బుక్ చేసుకున్నా డబుల్ ట్రిప్ రూ. 20వేల వరకు ఉంటుంది. కానీ ఇది అంతకుమించి ఉండగా.. వీటిపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అదనపు సొలిసిటర్ జనరల్ కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను కోర్టుకు సమర్పించగా.. “మీరు సంక్షోభం ఏర్పడిన తర్వాతే అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రశ్న అది కాదు. అసలు ఆ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు?” అని న్యాయస్థానం ప్రశ్నించింది. పైలట్‌లపై అధిక పని భారం ఎందుకు ఉందో, దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కూడా కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది.

మరోవైపు కేంద్రం నిర్ణయంపై ఇండిగో సంస్థ స్పందించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే అన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తామని ప్రకటించింది. ప్రస్తుతానికైతే.. సర్వీసులు గాడిలో పడ్డట్లు చెప్తున్నా.. ఇలా రోజుకో 200 సర్వీసులు క్యాన్సిల్ చేయడం ఇండిగోకి ఆర్ధికంగా దెబ్బ పడటంతో పాటు ఈరోజుల్లో టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు తిరిగి రీషెడ్యూల్ చేసుకోవాలి. దీంతో రాబోయే రోజుల్లో ఇండిగోకి కొత్త సమస్యలు తప్పవంటున్నారు.

Also Read: ఓరి నాయనో.. ఏఐతో రొమాన్సా..! హ్యూమన్ రిలేషన్స్‌లో కొత్త కోణం.. ఎందుకిలా..