చెన్నైలో భూ ప్రకంపనలు : హడలిపోతున్న జనం

చెన్నై : చెన్నై వాసులను భూప్రకంపనలు హడలెత్తించాయి. సోమవారం (ఫిబ్రవరి 11) అర్థరాత్రి 1.30 గంటల సమయం…అంతా మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా చిన్న ప్రకంపన…ఏం జరిగిందో అర్థం చేసుకునేలోగానే కదలికలు…ఉలిక్కిపడ్డ జనం ఇళ్లు వదిలి బయటకు పరుగుతీశారు. మంగళవారం తెల్లవారు జామున వచ్చిన స్వల్ప భూకంపం ప్రకంపనలు చెన్నై నగరంపై ప్రభావం చూపడంతో జనం ఉలిక్కిపడ్డారు. ఇది రిక్టర్ స్కేల్‌పై 4.9గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే విభాగం తెలిపింది. చెన్నై నుంచి 609 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి అత్యంత లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది.
ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి చెన్నైలో తేలికపాటి వర్షాలు కురుస్తుండడం నగర వాసుల్లో మరింత ఆందోళనకు కారణమైంది. ఓవైపు భూకంపం, మరోవైపు వర్షాలతో ఎక్కడ సునామీ వస్తుందోనని వారంతా భయాందోళనలకు గురయ్యారు. కాగా 2018 లో గజ తుఫానుతో అల్లాడిపోయిన తమిళనాడు వాసులు ఆ ప్రభావం నుంచి కోలుకుంటున్న క్రమంలో ఉన్నట్టుండి ఈ వర్షాలు..భూ ప్రకంపనలతో భయాందోళనలకు గురవుతున్నారు. కాగా భూకంపం ప్రభావం బంగ్లాదేశ్‌పై ఎక్కువ ఉందని..సునామీ వంటి ప్రమాదమేదీ లేదని అధికారులు తేల్చిచెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.